: 'అమ్మంటే అమ్మే'... జయలలితపై వాషింగ్టన్ పోస్ట్ ప్రత్యేక కథనం

నిన్న రాత్రి 11:30 గంటల సమయంలో గుండెపోటుతో మరణించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై 'ది వాషింగ్టన్ పోస్ట్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. "మా ప్రియమైన నేత, భారత ఉక్కు మహిళ... అమ్మ ఇకలేరు" అంటూ ఏఐఏడీఎంకే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆపై ప్రధాని మోదీ సంతాప సందేశాన్ని ప్రచురించింది. జయలలిత చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ, అమ్మ క్యాంటీన్లు, అమ్మ ఫార్మసీలు, అమ్మ వాటర్, అమ్మ సిమెంట్ తదితరాలు తమిళులందరికీ జయను కన్నతల్లికన్నా ఎక్కువగా మారిపోయారని వెల్లడించింది. అతి తక్కువ డబ్బుతో కడుపు నిండా అన్నం పెట్టించిన ఘనత ఆమెదని వెల్లడించింది. అపోలో ఆసుపత్రిలో జయలలిత చేరినప్పటి నుంచి నిత్యమూ వేలాది మంది ఆసుపత్రి ఎదుట పడిగాపులు కాశారని, వీరి ప్రార్థనలకు దేవుడు కరగలేదని పేర్కొంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ, ప్రజలు జయలలితను నమ్మి నాలుగు సార్లు అధికారాన్ని అప్పగించారని వెల్లడించింది. కోర్టు కేసులు, జైలు శిక్షలు ప్రజలకు ఆమెను దూరం చేయలేదని గుర్తు చేసింది. తాను నమ్మిన దారిలో పయనిస్తూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ఆమె మరణాన్ని తమిళులు తట్టుకోలేక పోతున్నారని 'ది వాషింగ్టన్ పోస్ట్' పేర్కొంది.

More Telugu News