: అందుకే ‘అమ్మ’ అంటే తమిళులకు పిచ్చి ప్రేమ!

జయలలిత.. దేశ రాజకీయాల్లో తిరుగులేని పేరు. కోమలవల్లిగా పుట్టి జయలలితగా మారి పురుచ్చితలైవిగా, అమ్మగా, విప్లవ నాయకిగా అంచెలంచెలుగా ఎదిగి తమిళనాడులో మహాశక్తిగా ఎదిగారు. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. తమిళ సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి తనదైన ముద్రవేసిన నాయకుల్లో ఎంజీఆర్ ఒకరు. ఆయన శైలి ఆయనను పురుచ్చితలైవర్ (విప్లవ నాయకుడు)గా పిలుచుకునేలా చేసింది. ఆయన స్ఫూర్తితో, సాన్నిహిత్యంతో జయలలిత కూడా సినీ రంగం నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఎంజీఆర్ శిశ్యురాలిగా ఖ్యాతిగాంచిన ఆమెను కూడా తమిళ ప్రజలు పురుచ్చితలైవి(విప్లవ నాయకి)గా పిలవడం మొదలుపెట్టారు. రాజకీయాల్లో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే జయలలిత ఎన్నో పరాభవాలు ఎదుర్కొన్నారు. అధికార పక్షమైన డీఎంకే సభ్యులు నిండు సభలో ఆమెపై దాడి చేశారు. దీంతో ఆ పార్టీని గద్దె దించే వరకు సభలో అడుగుపెట్టేది లేదని శపథం చేశారు. అన్నట్టుగానే డీఎంకేను గద్దె దించాకే అసెంబ్లీలో అడుగుపెట్టారు. పోరాటం విషయంలో ఆమె ఏనాడూ వెనక్కి తగ్గలేదు. జయలలితగా ప్రపంచానికి తెలిసిన ఆమెకు తల్లిదండ్రులు పెట్టిన పేరు కోమలవల్లి. సినీరంగంలో జయలలితగా ఖ్యాతిగాంచారు. పలుమార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆమె పేదల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుని ‘అమ్మ’గా మారారు. మొదట్లో ప్రత్యర్థులను అణచివేసేందుకే ఆమె తన పదవిని ఉపయోగించుకుంటున్నారన్న విమర్శలు ఉండేవి. అయితే 2011లో మరోమారు అధికారం చేపట్టాక ‘అమ్మ’ వైఖరిలో పూర్తి మార్పు కనిపించింది. తన దృష్టిని పూర్తిగా పేదల సంక్షేమంపైనే కేంద్రీకరించారు. అనేక పథకాలను ప్రవేశపెట్టారు. సామాన్యుల కష్టాలకు వెంటనే స్పందించేవారు. వ్యక్తి ఆరాధనను అధిగమించి ప్రజలకు సన్నిహితంగా మారారు. రూపాయికే ఇడ్లీ పథకం ప్రవేశపెట్టారు. పదుల సంఖ్యలో ప్రజాకర్షక పథకాలు తీసుకొచ్చి తమిళుల హృదయాలకు మరింత దగ్గరయ్యారు. శాంతి భద్రతల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించేవారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడేవారు. తన తుది శ్వాస వరకు పేదల సంక్షేమమే ధ్యేయంగా బతికారు. అందుకే ‘అమ్మ’ అంటే తమిళులకు పిచ్చి ప్రేమ.

More Telugu News