: తమిళనాట అప్పుడే మొదలైన కుట్రలు.. ‘అమ్మా’డీఎంకేను నడిపేదెవరు?

‘అమ్మ’ అంటే అన్నాడీఎంకే.. అన్నాడీఎంకే అంటే జయలలిత. పార్టీతో ఆమె అనుబంధం అంతలా పెనవేసుకుపోయింది. రెండు నెలలకు పైగా చికిత్స తర్వాత జయ సోమవారం రాత్రి కన్నుమూశారు. ఆమె మృతితో తమిళనాడులో అప్పుడే కుట్రలు మొదలయ్యాయి. ఆధిపత్య పోరు ప్రారంభమైంది. ఎత్తులు, పై ఎత్తులు మొదలయ్యాయి. జయ ఆస్పత్రిలో ఉండగా పార్టీలో మూడు అధికార కేంద్రాలు నడిచినట్టు ప్రచారం జరిగింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి, తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్ పాలనాపరంగా జయ వ్యవహారాలన్నీ చూసేవారు. జయ సలహాదారు కూడా అయిన ఆమె అధికార యంత్రాంగాన్ని ముందుండి నడిపించారు. ఇక జయ అధికారానికి దూరంగా ఉన్నప్పుడు ఆమెకు అత్యంత విశ్వాసపాత్రుడు అయిన పన్నీర్ సెల్వం పగ్గాలు చేపట్టేవారు. జయ పరోక్షంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన పన్నీర్ సెల్వం తాజాగా ఆమె మృతి తర్వాత కూడా ఆయనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మూడో వ్యక్తి జయలలిత నెచ్చెలి శశికళ. ‘అమ్మ’ ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులూ ఆమె జయ పక్కనే ఉన్నారు. జయ అధికారంలో ఉండగా ఆమె రెండో అధికార కేంద్రంగా వ్యవహరించేవారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎంపికలోనూ ఆమె కీలకపాత్ర పోషించారు. పన్నీర్ సెల్వంను సీఎంగా పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం వెనక ఆమె హస్తం ఉందని సమాచారం. అయితే సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన పన్నీర్ సెల్వంను అటు ప్రజలు, ఇటు పార్టీ నాయకులు ఏమేరకు అంగీకరిస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉంటే 136 స్థానాల్లో అన్నాడీఎంకే జయకేతనం ఎగరవేసింది. అయితే వీటిలో 60 మంది ఎమ్మెల్యేలు శశికళ కోటరీకి చెందినవారే. అంతేకాదు, వీరిలో 12 మంది మంత్రులు కూడా వున్నారు. పన్నీర్ సెల్వంపై శశికళకు విశ్వాసం లేకపోయినా అప్పుడే పదవుల కోసం వెంపర్లాడితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఆమె వెనక్కి తగ్గినట్టు సమాచారం. ప్రస్తుతం పార్టీలో సాధారణ పరిస్థితులే ఉన్నా మరికొన్ని నెలల్లో సమీకరణాలు మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. పన్నీర్ సెల్వంను సీఎంగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ప్రకటించడం వెనక ఉన్న కారణం ఇదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు అన్నాడీఎంకే పార్టీని అస్థిరపరిచేందుకు డీఎంకే నుంచి ప్రయత్నాలు ప్రారంభమవుతాయని చెబుతున్నారు.

More Telugu News