: అదుపు తప్పి పక్కకు పడిపోయిన యుద్ధనౌక ఐఎన్ఎస్ బెత్వా.. ఇద్దరు నేవీ సైలర్లు మృతి

భారత్ కు చెందిన ప్రతిష్టాత్మక యుద్ధనౌక ఐఎన్ఎస్ బెత్వా పక్కకు పడిపోయిన సంఘటనలో ఇద్దరు నేవీ సైలర్లు మృతి చెందగా, 14 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ముంబయిలోని డాక్ యార్డులో ఈరోజు ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనపై నేవీ అధికార ప్రతినిధి కెప్టెన్ డీకే శర్మ మాట్లాడుతూ, దుర్మరణం చెందిన సైలర్లలో ఒకరు నీటిలో పడిపోగా, మరొకరు నౌక లోపలి భాగంలో చిక్కుకుపోయినట్లు చెప్పారు. చిన్నపాటి రిపేర్ల అనంతరం డాక్ యార్డు నుంచి ‘బెత్వా’ను నీటిలోకి తీసుకువెళ్తున్న సమయంలో అదుపుతప్పి ఓ వైపునకు పడిపోయినట్లు చెప్పారు. ఈ సంఘటనలో 3,850 టన్నుల బరువు ఉన్న ‘బెత్వా’ మెయిన్ మాస్ట్ పగిలిపోయినట్లు చెప్పారు. డాక్ బ్లాక్స్ మెకానిజం ఫెయిల్ అవడం కారణంగానే ఈ దుర్ఘటన జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నామన్నారు. కాగా, 2011 నుంచి ఇప్పటివరకు చూస్తే.. డాక్ యార్డు నుంచి తరలిస్తున్న సమయంలో ప్రమాదానికి గురైన మూడోయుద్ధనౌక ఇది. 2013లో.. ముంబయి హార్బర్ లో సబ్ మెరైన్ ఐఎన్ఎస్ సింధు రక్షక్ లో మంటలు వ్యాపించడంతో 18 మంది సైలర్లు ప్రాణాలు కోల్పోయారు. 2014లో.. న్యూక్లియర్ సబ్ మెరైన్ లో సంభవించిన అగ్నిప్రమాదం కారణంగా ముంబయి కోస్ట్ కు చెందిన ఇద్దరు నేవీ అధికారులు మృతి చెందారు.

More Telugu News