: రాత్రికి రాత్రే ఆ ఊర్లోని వారంతా కోటీశ్వరులైపోయారు!

లక్ష్మీదేవి తలుపుతడితే కూటికి గతిలేకపోయినా కోటీశ్వరుడైపోతాడంటారు. దీనిని స్పెయిన్ లోని ఓ గ్రామం నిజం చేసింది. వివరాల్లోకి వెళ్తే... స్పెయిన్‌ లోని సెరిజేల్ డెల్ కాండెడో అనే ఓ చిన్న పల్లెటూరి జాతకాన్ని ఆంటోనినో ఫెర్నాండేజ్ రాత్రికిరాత్రే మార్చేశాడు. ఊర్లోని ప్రతి ఒక్కరినీ రాత్రిరాత్రే కోటీశ్వరుణ్ణి చేశాడు. ఆంటోనినో ఫెర్నాండేజ్ ‘కరోనా’ అనే బీర్ల తయారీ సంస్థకు యజమాని. బాల్యంలో చదువుకోవాలని చాలా ప్రయత్నించాడు. అయితే అతని కుటుంబ ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే కావడంతో కుదరలేదు. దీంతో కేవలం 14 ఏళ్ల వయసులోనే బడికి వెళ్లడం మానేసి, కుటుంబానికి సహాయపడేందుకు, దగ్గర్లోని ఓ బీర్ల తయారీ కంపెనీలో పనిచేశాడు. స్వతహాగా తెలివైనవాడైన ఆంటోనినో అంచెలంచెలుగా ఎదిగి ‘కరోనా’ అనే బీర్ల తయారీ సంస్థను నెలకొల్పాడు. తాను మారినా తన గ్రామం రూపురేఖలు మారకపోవడంతో గ్రామానికి ఏదైనా చేయాలని భావించిన ఆంటోనినో ఫెర్నాండెజ్...తన మరణానంతరం తన ఆస్తిలోని ఎక్కువభాగం గ్రామ వాసులకు చెందాలని, దానితో గ్రామీణులు బాగా చదువుకోవాలని, ఊరిని బాగు చేసుకోవాలని తన వీలునామాలో రాశారు. అంత గొప్పవాడైన ఫెర్నాండెజ్ గత ఆగస్టులో మరణించారు. దీంతో ఆయన మరణానంతరం సంక్రమించిన ఆస్తిని గ్రామంలోని ప్రతి ఇంటికి పంచారు. గ్రామంలోని 150 కుటుంబాలలో ఒక్కో కుటుంబానికి సుమారు 17 కోట్ల రూపాయలు రావడం విశేషం. దీంతో రాత్రికి రాత్రే గ్రామీణులంతా కోటీశ్వరులైపోయారు. వారి ఆనందానికి అంతులేకుండా పోయింది. ఆయన ఆశయసాధనకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తామని గ్రామస్తులు ప్రకటించారు.

More Telugu News