: బిస్మిల్లా ఖాన్ ‘షెహనాయ్’ల తస్కరణ!

భారత రత్న ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ కు చెందిన ‘షెహనాయ్’ వాయిద్య పరికరాలను దొంగలు ఎత్తుకెళ్లిన సంఘటన వారణాసిలో చోటు చేసుకుంది. దివంగత ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ కుమారుడు కాజిమ్ హుస్సేన్ నివాసంలో ఈ దొంగతనం జరిగింది. నవంబరు 30వ తేదీన తన పూర్వీకుల గ్రామమైన హాదా సరాయ్ కు ఆయన వెళ్లాడు. అనంతరం వారణాసిలోని దాల్ మాండీలోని తన నివాసానికి నిన్న రాత్రి చేరుకున్న ఆయన తన ఇంటి మెయిన్ గేట్ పగులగొట్టి ఉండటంతో ఆశ్చర్యపోయాడు. ఇంట్లోకి వెళ్లిన ఆయన పరిశీలించి చూడగా తన తండ్రి ఉపయోగించిన ‘షెహనాయ్’ వాయిద్య పరికరాలు ఐదింటిని దొంగలు ఎత్తుకుపోయినట్లు గ్రహించాడు. ఈ సందర్భంగా కాజిమ్ మాట్లాడుతూ, ఐదు ‘షెహనాయ్’లలో నాలుగు వెండివి అని, తన తండ్రికి అవి గిఫ్ట్ గా వచ్చినవని చెప్పారు. మొహర్రం రోజులలో ఎంతో విలువైన ‘ఉడెన్ షెహనాయ్’తో తన తండ్రి వాయిస్తుండే వారని, దానిని కూడా దొంగలు పట్టుకుపోయారని ఆయన బాధపడ్డారు. తన తండ్రి ఉపయోగించిన ఈ వాయిద్య పరికరాలు ఎంతో విలువైనవని, వాటిని దొంగలు తస్కరించడం బాధకు గురిచేసిందని ఆయన వాపోయారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, ‘షెహనాయ్’ కింగ్ బిస్మిల్లా ఖాన్ ఉపయోగించిన పరికరాలు దొంగల పాలవడం ఇది మొదటిసారేమీ కాదు. రెండేళ్ల క్రితం ఆయన ఉపయోగించిన ‘షెహనాయ్’ పరికరాన్ని దొంగలు ఎత్తుకుపోయారు. ప్రతి ఉదయం గంగా నది ఘాట్ల వద్ద కూర్చుని ఆయన వాయించే ‘రియాజ్ షెహనాయ్’ను దొంగలు ఎత్తుకుపోయారు. దీని ఆచూకీ ఇంతవరకూ గుర్తించకపోవడం గమనార్హం.

More Telugu News