: చైనా తీరుపై మండిపడ్డ డొనాల్డ్ ట్రంప్‌

అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప‌లు అంశాల‌పై త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డిస్తూ అధ్య‌క్ష పీఠం మీద కూర్చోక‌ముందే తాను అనుస‌రించ‌నున్న విధానాల గురించి ట్విట్ట‌ర్ ద్వారా ట్వీట్లు చేస్తూ దూకుడును క‌న‌బ‌రుస్తున్నారు. తాజాగా ఆయ‌న చైనా తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ దేశ విదేశీ విధానానికి భిన్నంగా ఇటీవ‌లే ఆయ‌న‌ తైవాన్‌ అధ్యక్షురాలు సాయ్‌ ఇంగ్‌ వెన్‌తో మాట్లాడి అంద‌రినీ ఆశ్చ‌ర్యపరచిన విష‌యం తెలిసిందే. దీంతో తైవాన్ త‌మ భూభాగ‌మ‌ని చెప్పుకునే చైనా ట్రంప్ చ‌ర్య‌పై మండిప‌డింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా చైనా వైఖ‌రిపై వ‌రుస ట్వీట్లు చేశారు. చైనా క‌రెన్సీ విధానాన్ని, దక్షిణ చైనా సముద్రంలో ఆ దేశ కార్యక్రమాల అంశాల‌ను ఆయ‌న లేవ‌నెత్తారు. ఇటీవ‌ల చైనా తమ కరెన్సీ విలువ తగ్గించింద‌ని, ఆ స‌మ‌యంలో చైనా ఆ అంశం గురించి అమెరికాను అడిగిందా?.. లేదుక‌దా? అని ట్రంప్ ప్ర‌శ్నించారు. ద‌క్షిణ చైనా సముద్ర‌లో ఆ దేశం భారీ మిల‌ట‌రీ కాంప్లెస్ క‌ట్టిన‌ప్పుడు కూడా మమ్మల్ని అడ‌గ‌లేదు క‌దా? అని దుయ్య‌బ‌ట్టారు. త‌మ దేశ కంపెనీలపై ప్రభావం పడేందుకే చైనా తన కరెన్సీ విలువలను తగ్గించుకుందని ట్వీట్ లో పేర్కొన్న ఆయ‌న, చైనాకు ఎగుమతి అవుతున్న అమెరికన్‌ ఉత్పత్తులపై పన్నులు అధికంగా వేస్తుందని పేర్కొన్నారు. అయితే, త‌మ దేశం మాత్రం చైనా ఉత్పత్తులపై ఎటువంటి పన్నులు విధించడం లేదని అన్నారు. తమ దేశంలో ప్రస్తుతం కొన్ని చైనా వస్తువులపైనే పన్నులు తీసుకుంటోంద‌ని చెప్పారు.

More Telugu News