: మమతా బెనర్జీ గారూ, మీరు 'దీదీ'గానే ఉండండి... 'దాదా'గా కాదు: జేడీయూ ఆగ్రహం

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీపై జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) ఆగ్రహం వ్యక్తం చేసింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను వెన్నుపోటుదారుడిగా మమత వ్యాఖ్యానించడంతో జేడీయూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. మమతా బెనర్జీ 'దీదీ'గా ఉంటేనే బాగుంటుందని... 'దాదా'గా మారి వ్యవహారాలు చేయాలనుకుంటే కుదరదని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని నితీష్ కుమార్ బహిరంగంగానే సమర్థిస్తున్న సంగతి తెలిసిందే. మిగిలిన విపక్ష నేతలు మాత్రం మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో, బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన ఓ బహిరంగసభలో మమతా బెనర్జీ మాట్లాడుతూ... నోట్ల రద్దు వ్యవహారంలో విపక్షాలన్నీ ఏకమయ్యాయని... వెన్నుపోటుదారులు మాత్రం వేరుగా ఉన్నారని... అలాంటి వారిని ప్రజలు క్షమించరంటూ నితీష్ పేరును ప్రస్తావించకుండా మమత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల జేడీయూ నేతలు అదే స్థాయిలో ప్రతిస్పందించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే ఒక స్కాముల పార్టీ అని... చిట్ ఫండ్ స్కాముల ద్వారా ఆమె పార్టీ సభ్యులు వెనకేసుకున్న నల్లధనంపై ముందు ఆమె చర్య తీసుకోవాలని ఎద్దేవా చేశారు. పశ్చిమబెంగాల్ లో జరుగుతున్న చిట్ ఫండ్ వ్యాపారమంతా బ్లాక్ మనీతోనే జరుగుతోందని... ముందు దానిపై విచారణ జరిపించాలని మమతకు సూచించారు.

More Telugu News