: ఇద్దరు ప్రధానుల రాజీనామా... ఇటలీ, న్యూజిలాండ్ లో రాజకీయ అనిశ్చితి!

గడచిన ఎనిమిది సంవత్సరాలుగా న్యూజిలాండ్ ప్రధానిగా ఉన్న జాన్ కీ, రెఫరెండంలో వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఇటలీ ప్రధాని రెంజీ తమ పదవులకు సోమవారం నాడు రాజీనామాలు చేసి సంచలనమే సృష్టించారు. న్యూజిలాండ్ లో అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా గుర్తింపున్న ఆయన రాజీనామా ప్రకటనను ప్రజలు సైతం ఎంతమాత్రమూ ఊహించలేదని తెలుస్తోంది. ప్రజాదరణ ఉన్న నేతగా కొనసాగుతూనే తప్పుకోవాలని భావించిన ఆయన, ఇంతకాలం పాటు వ్యక్తిగత జీవితానికి దూరం అయ్యానని, ఇకపై కుటుంబంతో గడిపేందుకు మరింత సమయం కేటాయిస్తానని చెప్పారు. కాగా, 2002లో తొలిసారి చట్టసభకు ఎన్నికైన జాన్, 2008 నుంచి న్యూజిలాండ్ కు ప్రధానిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో రాజ్యాంగ సవరణ కోసం ఆదివారం నాడు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేయడంతో, నైతిక బాధ్యత వహిస్తూ, ఇటలీ ప్రధాని రెంజీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు అధ్యక్షుడు సెర్గియో మాటరెల్లాను కలసి రాజీనామా లేఖను ఇచ్చారు. తన పాలన ఇంతటితో ముగిసిందని, కొత్త ప్రధానికి సహకరిస్తానని రెంజీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇద్దరు ప్రధానుల రాజీనామాలతో ఆయా దేశాల్లో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది.

More Telugu News