: అలా చేస్తే ఎన్టీఆర్ పేరు దిగజార్చడమే.. చంద్రబాబుపై రఘువీరా సీరియస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఓటుకు నోటు కేసుకు భయపడి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను సీఎం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఆదివారం అనంతపురం జిల్లాలోని మడకశిరలో విలేకరులతో మాట్లాడిన ఆయన సీఎంపై మండిపడ్డారు. కృష్ణానది నుంచి తెలంగాణ 125 టీఎంసీల నీటిని దోచుకుపోతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని చంద్రబాబును ప్రశ్నించారు. మహిళలకు పసుపు కుంకుమ కింద ఇచ్చిన రూ.3వేలు వడ్డీకి కూడా సరిపోవన్న ఆయన చంద్రబాబు ప్రజాధనాన్ని విపరీతంగా దుర్వినియోగం చేస్తున్నారన్నారు. హంద్రీ-నీవా కాలువ పనుల అంచనాలను రూ.4వేల కోట్లకు పెంచడం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. కాంగ్రెస్ కనుక అధికారంలో ఉండి ఉంటే ఆ పనులను కేవలం రూ.1200 కోట్లతో పూర్తి చేసి ఉండేవాళ్లమన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ చాలా చిన్న చెరువు అని, దానికి ఎన్టీఆర్ పేరుపెట్టడమంటే ఆయన పేరును దిగజార్చడమే అవుతుందని అన్నారు. చంద్రబాబు ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కొత్త హామీలు గుప్పిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు తిరుగబడే రోజు అతి దగ్గర్లోనే ఉందన్నారు.

More Telugu News