: ‘రచ్చబండ’ కూడా చేవెళ్ల నుంచి ప్రారంభించినట్లయితే రాజశేఖర్ రెడ్డి అన్న బతికుండేవాడేమో!: సబితా ఇంద్రారెడ్డి

‘రచ్చబండ’ కూడా చేవెళ్ల నుంచి ప్రారంభించినట్లయితే వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉండేవారేమోనని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్న తన పాదయాత్రను తాండూరు నుంచి మొదట ప్రారంభించాలనుకున్నప్పుడు, అసెంబ్లీలోని తన ఛాంబర్ లోకి పిలిచి ఈ విషయం చెప్పారు. ఆ తర్వాత ఆయన దగ్గరకు వెళ్లి.. చేవెళ్లలో బహిరంగ సభ పెట్టి ఆ తర్వాత తాండూరు వెళ్లి అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించాలని అడిగితే, ‘సరే’ అని చెప్పారు. మళ్లీ ఆ తర్వాత రోజు ఆయన పిలిచి.. ‘లేదమ్మా... చేవెళ్ల నుంచే పాదయాత్ర ప్రారంభిస్తాను’ అని అన్నారు. నేను వద్దన్నాను. ఎందుకంటే, వితంతువులపై సమాజంలో చిన్నచూపు ఉంది. సెంటిమెంటల్ గా తీసుకుని ఇక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించవద్దని, తాండూరు నుంచే చేయాలని రాజశేఖర్ రెడ్డి అన్నకు చెప్పాను. ‘నువ్వు అట్లా అన్నావు కాబట్టి, నేను ఇక్కడి నుంచే పాదయాత్ర మొదలుపెడతాను’ అని రాజశేఖర్ రెడ్డి ఈ యాత్రను చేవెళ్ల నుంచే ప్రారంభించారు. దాంతో పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచి ముగిసే వరకూ నేను చాలా టెన్షన్ పడ్డాను. పాదయాత్రలో రాజశేఖర్ రెడ్డి అన్న సిక్ అయినప్పుడు మరీ టెన్షన్ కు గురయ్యాను. ఆ తర్వాత ఆయన్ని కలిసినప్పుడు చెప్పాను ‘వద్దంటే, ఇక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభించారు. మీరు సిక్ అయ్యారు’ అని. ‘ఇవన్నీ మామూలేనమ్మా’ అని రాజశేఖర్ రెడ్డి సమాధానమిచ్చారు. ‘పల్లెబాట’ కూడా చేవెళ్ల నుంచే ప్రారంభించారు. పాదయాత్ర ఒకటే కాదు, చాలా కార్యక్రమాలు చేవెళ్ల నుంచే ప్రారంభించారు. అయితే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్న ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడే ఆయన మమ్మల్ని ఎందుకు మర్చిపోయారా? అని బాధ వేస్తుంది. ‘రచ్చబండ’ను చేవెళ్ల నుంచే ప్రారంభించినట్లయితే రాజశేఖర్ రెడ్డి అన్న బతికుండేవాడేమో అనిపిస్తుంది’ అని సబితా ఇంద్రారెడ్డి నాటి విషయాలను గుర్తుచేసుకున్నారు.

More Telugu News