: గురితప్పిన మోదీ బాణం... నల్లధనం ఎక్కడుంది?

నల్లధనంపై ప్రధాని నరేంద్ర మోదీ వేసిన రామబాణం గురితప్పిందా? నోట్ల రద్దుకు ముందు అంచనా వేసినట్టుగా రూ. 4 లక్షల కోట్ల నుంచి రూ. 5 లక్షల కోట్ల నల్లధనం, ఖజానాకు అయాచిత ఆదాయంగా మిగిలి సంక్షేమ పథకాల అమలుకు ఇబ్బడి ముబ్బడిగా నిధులందించే పరిస్థితి లేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కనీసంలో కనీసం రూ. 3 లక్షల కోట్ల వరకైనా మిగులుతుందని కేంద్రం వేసిన అంచనాలూ లెక్క తప్పాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, శనివారం నాడు బ్యాంకులు మూసివేసే సమయానికి మొత్తం రూ. 9.85 లక్షల కోట్లు బ్యాంకుల్లోకి డిపాజిట్ అయ్యాయి. వ్యవస్థలో మొత్తం పెద్ద నోట్లు రూ. 14.6 లక్షల కోట్లు ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో, నోట్ల డిపాజిట్ కు మరో 26 రోజుల సమయం ఉన్న సంగతి తెలిసిందే. ఈ 26 రోజుల్లో ఎంతలేదన్నా ప్రజల నుంచి మరో రెండు లక్షల కోట్ల నుంచి రెండున్నర లక్షల కోట్ల వరకూ డిపాజిట్లు రావచ్చని అంచనా. ఈ నేపథ్యంలో రద్దయిన 14.6 లక్షల కోట్ల పెద్ద కరెన్సీలో కనీసం 10 శాతం వరకూ ప్రభుత్వానికి మిగలవచ్చని, అంతకు మించి ప్రయోజనాన్ని ఆశించడం అత్యాసే అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. దేశంలోని నల్లధనం ఏనాడో ఇతర రూపాల్లోకి మారిపోయిందని, బంగారం, స్థిర, చరాస్తుల రూపంలోకి, బినామీ పేర్ల ఆస్తుల కిందకు నల్లధనం మారిపోయినట్టు ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని ఆర్థికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, బ్యాంకుల్లో డిపాజిట్ అయిన నల్లధనంలో అత్యధికం జన్ ధన్ ఖాతాల్లోకి రూ. 49 వేల డిపాజిట్ రూపంలో వచ్చినట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. రూ. 50 వేలు దాటితే పాన్ కార్డు నంబర్ చెప్పడం తప్పనిసరైన నేపథ్యంలో, రూ. 49 వేల చొప్పున ఈ ఖాతాల్లో జమ అయినట్టు తెలుస్తోంది. ఇక ఈ ఖాతాలపై కన్నేసిన కేంద్రం, జన్ ధన్ ఖాతాల నుంచి విత్ డ్రాలపై కఠిన నిబంధనలను విధించిన సంగతి తెలిసిందే.

More Telugu News