: ఒక్క వీధికి కూడా ఫిడేల్ క్యాస్ట్రో పేరు వద్దు, ఒక్క విగ్రహం కూడా పెట్టొద్దు: రౌల్ క్యాస్ట్రో ఆదేశాలు

క్యూబా వేగుచుక్క ఫిడేల్ క్యాస్ట్రో అంత్యక్రియలు వేడుకగా జరుగుతున్న వేళ, ఆయన సోదరుడు, దేశాధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో నుంచి కీలక ఆదేశాలు వెలువడ్డాయి. క్యూబాలో ఏ వీధికి కూడా ఫిడేల్ క్యాస్ట్రో పేరును పెట్టరాదని, ఎక్కడా ఆయన విగ్రహం పెట్టవద్దని రౌల్ ఆదేశించారు. ఈ మేరకు రెండు మూడు రోజుల్లో చట్టం తీసుకురానున్నట్టు స్పష్టం చేశారు. ఫిడేల్ బతికున్న రోజుల్లో వ్యక్తి పూజకు ఆయన పూర్తి వ్యతిరేకమని గుర్తు చేసిన రౌల్, ఆయన అభిప్రాయాన్ని ప్రజలంతా గౌరవించాలని పిలుపునిచ్చారు. వీధులు, రహదారులకు క్యాస్ట్రో పేరు వద్దని, కేవలం పేర్లు పెట్టినంత మాత్రానే ఆయన ప్రజలకు గుర్తుంటారని తాను భావించడం లేదని రౌల్ వ్యాఖ్యానించారు. కాగా, సంతియాగోలో ఫిడెల్ అంత్యక్రియలు లక్షలాది మంది క్యూబన్ల అశ్రునయనాల మధ్య ముగిశాయి. శాంటా ఇఫిగెనియా శ్మశాన వాటికలో ఆయన అవశేషాలను ఖననం చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ దేశాల నేతలు హాజరై, ఫిడెల్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

More Telugu News