: మళ్లీ బీజేపీ కూటమిలోకా?... జీవితంలో జరగదు: నితీశ్ కుమార్

ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు అంశానికి బహిరంగంగా పూర్తి మద్దతు తెలిపి, మహా కూటమిలోని ఇతర పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొన్న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, తాను తిరిగి బీజేపీ అలయన్స్ లో చేరతానని వస్తున్న వార్తలను ఖండించారు. తాను తిరిగి ఎన్డీఏలో చేరడమన్నది జీవితంలో జరగని విషయమని కుండబద్దలు కొట్టారు. "నోట్ల రద్దుకు నేను మద్దతిచ్చాను. ఎందుకంటే, అది మంచి నిర్ణయమని మాత్రమే. అంతమాత్రాన నేను తిరిగి బీజేపీ కూటమిలో చేరతానని కాదు. రాజకీయ అంశంగా నోట్ల రద్దుకు మద్దతును పరిగణించరాదు" అని హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సదస్సులో ఆయన వ్యాఖ్యానించారు. కేవలం పాత నోట్లను రద్దు చేసినంత మాత్రాన నల్లధనాన్ని పట్టుకోలేమని, బినామీలను గుర్తించి వారి ఆస్తులపై దాడులు చేయాలని నితీశ్ పిలుపునిచ్చారు. బీజేపీ చెప్పినట్టు నోట్ల రద్దు, నల్లధనంపై సర్జికల్ దాడే అయితే, దీన్ని కేవలం ప్రారంభంగా మాత్రమే గుర్తించాలని, ఇంకా చేయాల్సింది చాలా వుందని అన్నారు. కాగా, నితీశ్ నిత్యమూ నరేంద్ర మోదీని పొగుడుతుంటే, కాంగ్రెస్, ఆర్జేడీ తదితర మహా కూటమిలోని పార్టీలు ఆయన వైఖరిని తప్పుబడుతున్న సంగతి తెలిసిందే.

More Telugu News