: గతంలో నా ఓట‌మికి కార‌ణం నా చ‌ర్య‌లే.. ఆ గుణ‌పాఠాలే భ‌విష్య‌త్‌కు బాట‌లు వేశాయి: చంద్ర‌బాబు

గ‌తంలో త‌న ఓట‌మికి తానే కార‌ణ‌మ‌ని, త‌న‌ను వేరే ఎవ‌రో ఓడించ‌లేద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శ‌నివారం ఢిల్లీలో జ‌రిగిన హిందూస్థాన్ టైమ్స్ నాయ‌క‌త్వ స‌ద‌స్సులో పాల్గొన్న ఆయ‌న‌ చ‌ర్చా వేదిక‌లో ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చారు. నాటి ఓటముల‌తో జాగ్ర‌త్త ప‌డ్డాన‌ని, గుణపాఠాలు నేర్చుకుని భ‌విష్య‌త్‌కు బాట‌లు వేసుకున్నాన‌ని పేర్కొన్నారు. బీజేపీతో క‌లిసి ముందుకు వెళ్తుండ‌డంపై స్పందిస్తూ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇద్ద‌రం క‌లిసి బ‌రిలోకి దిగామ‌ని, తాము కేంద్ర మంత్రివ‌ర్గంలో ఉంటే, బీజేపీ త‌న కేబినెట్‌లో ఉంద‌ని బ‌దులిచ్చారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన హామీల్లో కొన్ని అమ‌లు కాగా మ‌రికొన్ని అమ‌లు కావాల్సి ఉంద‌న్నారు. బీజేపీతో సంబంధాలు బాగున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని భారీ పెట్టుబ‌డితో నిర్మిస్తుండ‌డంపై చంద్ర‌బాబు మాట్లాడుతూ ప్ర‌పంచ‌వ్యాప్తంగా న‌గ‌రాలే అభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి అవ‌కాశాల‌కు తోడ్పాటు అందిస్తున్నాయన్నారు. విభ‌జ‌న త‌ర్వాత ఏపీకి రాజ‌ధాని నిర్మించుకోవాల్సి వస్తోందన్నారు. రాజ‌ధాని నిర్మాణం అరుదైన‌ అవ‌కాశమ‌న్న బాబు అమ‌రావ‌తిని దేశంలో టాప్‌-1గా, ప్ర‌పంచంలో టాప్‌-10 న‌గ‌రాల్లో ఒక‌టిగా తీర్చిదిద్దుతామ‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను క‌నుక ఓడిపోతే మొత్తం ప్ర‌ణాళిక‌లు తారుమార‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని, అందుకే నిరంత‌రాయంగా గెలుస్తూనే ఉండాల‌ని మ‌రో ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు. గ‌తంలో సైబ‌రాబాద్‌ను నిర్మించిన తాను ఇప్పుడు అమ‌రావ‌తిని నిర్మిస్తున్నందుకు గ‌ర్వంగా ఉంద‌న్నారు. హైద‌రాబాద్ వెళ్లిన‌ప్పుడల్లా అక్క‌డి భ‌వ‌నాల‌ను చూస్తుంటే గ‌ర్వంగా ఉంటుంద‌న్నారు. ఏపీ అభివృద్ధి ప్ర‌పంచానికే న‌మూనాగా మారుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. 2050 నాటికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ డెస్టినేష‌న్ కావాల‌నేదే త‌న ఆశ‌య‌మ‌న్నారు.

More Telugu News