: నోట్ల ర‌ద్దుతో కుదేల‌వుతున్న ప్ర‌క‌ట‌న‌ల రంగం.. మీడియాకు తగ్గిపోనున్న ఆదాయం!

నోట్ల ర‌ద్దుతో ఇబ్బందులు ప‌డుతున్న రంగాల్లో ప్ర‌క‌ట‌నల‌ రంగం కూడా చేరింది. వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు లేక మీడియా రంగం క‌కావిక‌లు అవుతోంది. కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌పైనే ఆధార‌ప‌డే దిన‌ప‌త్రిక‌లు, టీవీ చాన‌ళ్లు, రేడియోలు ఇప్పుడు ప‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నోట్ల ర‌ద్దుతో చివరి త్రైమాసికంలో ఈ రంగం రూ.1500- రూ.2000 కోట్ల వ‌ర‌కు న‌ష్టాన్ని మూట‌గ‌ట్టుకోనున్నట్టు అంచ‌నా. నగదు లేమితో వినియోగదారులు ఖ‌ర్చును విప‌రీతంగా త‌గ్గించుకుంటున్నందువలన కార్పొరేట్ సంస్థ‌లు కూడా ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డం ఆపేసిన‌ట్టు ఎక‌న‌మిక్ టైమ్స్ ప‌త్రిక ఓ క‌థ‌నంలో పేర్కొంది. నోట్ల ర‌ద్దు ప్ర‌భావం తాత్కాలిక‌మేన‌ని, త్వ‌ర‌లోనే అంతా స‌ర్దుకుంటుంద‌ని భావించామ‌ని, అయితే త‌మ అంచనా త‌ప్ప‌యింద‌ని ఆ క‌థ‌నంలో పేర్కొంది. చాలా కంపెనీలు త‌మ ప్ర‌క‌ట‌నల వ్య‌యాన్ని పూర్తిగా త‌గ్గించేసుకున్నాయ‌ని, డిసెంబ‌రులో ఇది మ‌రింత తీవ్ర‌రూపం దాల్చే అవ‌కాశం ఉంద‌ని మ‌రో సంస్థ‌కు చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. ప్ర‌క‌ట‌న‌ల రంగానికి ఈ త్రైమాసికంలో త‌క్కువ‌లో త‌క్కువ‌గా రూ.1500 కోట్ల న‌ష్టం ఉండవచ్చని అంచనా వేస్తున్న‌ట్టు డెంట్స్ ఏజిస్ నెట్‌వ‌ర్క్ ద‌క్షిణాసియా సీఈవో ఆశిష్ భాసిన్ తెలిపారు. ఈ త్రైమాసికంలో రూ.20 వేల కోట్ల విలువైన ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తాయ‌ని అంచ‌నా వేశామ‌ని, కానీ త‌మ అంచ‌నాలు త‌ల్ల‌కిందులు అవుతున్నాయ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ న‌ష్టాల నుంచి గ‌ట్టెక్కేందుకు ఎంత లేదన్నా మూడు నాలుగు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని ఐజీపీ మీడియా బ్రాండ్స్ సీఈవో శ‌శిసిన్హా పేర్కొన్నారు.

More Telugu News