: తండ్రిని అడ్డం పెట్టుకొని కోటీశ్వ‌రుల‌య్యారు.. ఇప్పుడు ఏవేవో మాట్లాడుతున్నారు: చ‌ంద్ర‌బాబు

కొందరు తండ్రిని అడ్డం పెట్టుకొని కోటీశ్వ‌రుల‌య్యారని.. కోటాను కోట్ల న‌ల్ల‌ధ‌నం సంపాదించి ఇప్పుడు ఏవేవో మాట్లాడుతున్నారని ముఖ్యమ‌ంత్రి చ‌ంద్ర‌బాబు నాయుడు అన్నారు. పెద్ద‌నోట్ల ర‌ద్దుతో ఇప్పుడు వారికి చిక్కులు వ‌చ్చాయ‌ని, అందుకే ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని చెప్పారు. వారు ఇష్టానుసారంగా వ్యాఖ్య‌లు చేయ‌డం మానుకోవాల‌ని సూచించారు. తాను ఓ ల‌క్ష్యం పెట్టుకున్నానని పేద‌రికం లేని స‌మాజాన్ని చూడాల‌న్నదే త‌న‌ జీవితాశ‌యమని ఆయ‌న చెప్పారు. పెద్ద నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో ఈ నెల రోజులు ఎంతో తెలివిగా ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని చెప్పారు. పెద్ద‌నోట్ల ర‌ద్దుపై ప్ర‌తిరోజు పత్రికల్లో నెగిటివ్ ఆర్టిక‌ల్స్ రాయ‌డం మంచిదికాదని చ‌ంద్ర‌బాబు అన్నారు. ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేయ‌కూడ‌దని చెప్పారు. ‘నగదురహిత లావాదేవీల గురించి ఓ క‌మిటీ వేశారు.. న‌న్నే స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా పెట్టారు.. ఆరుగురు ముఖ్య‌మంత్రుల‌ను నియ‌మించారు. ప‌లువురు మేధావుల‌ను నియమించారు. ప్ర‌పంచంలో ఎక్క‌డెక్క‌డ మంచి ప‌ద్ధ‌తులు ఉన్నాయో అవ‌న్నీ ప‌రిశీలించి నివేదిక అందించాల‌ని కోరారు’ అని చెప్పారు. ఆదాయం త‌గ్గినా సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగిస్తున్నామ‌ని చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లాకు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చే అవ‌కాశం ఉందని చెప్పారు. జిల్లాకు 20 టీఎంసీల నీరు తీసుకొచ్చామ‌ని, జిల్లాను ప‌ర్యాట‌క కేంద్రంగా త‌యారు చేస్తామ‌ని అన్నారు. ఈ రోజు ప్రారంభించిన గొల్ల‌ప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్‌కు ఎన్టీఆర్ రిజ‌ర్వాయ‌ర్‌గా నామ‌క‌ర‌ణం చేస్తున్నాన‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.

More Telugu News