: సొంత ఇమేజ్ చట్రంలో ఖైదీ మోదీ... టీఆర్పీ రాజకీయాలు తప్ప ఇంకేముంది?: రాహుల్ గాంధీ

తన సొంత ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, ప్రజల బాగోగులను పూర్తిగా విస్మరించారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయనకు టీఆర్పీ రాజకీయాలపైనే ఆసక్తి ఉన్నట్టు కనిపిస్తోందని, సొంత ఇమేజ్ చట్రంలో ఖైదీగా ఉండిపోయారని ఆరోపించారు. సోనియాగాంధీ అందుబాటులో లేని వేళ, కాంగ్రెస్ పార్టమెంటరీ పార్టీ సమావేశానికి అధ్యక్ష బాధ్యతలు రాహుల్ చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ తన ఇమేజ్ పెంచుకునే ప్రధానిని ఎన్నడూ నియమించలేదని ఆయన అన్నారు. మోదీ వచ్చిన తరువాత సరిహద్దుల్లో కాల్పులు పెరిగాయని, 80 మంది సైనికులు వీరమరణం పొందారని తెలిపారు. బీజేపీ వైఖరి కారణంగానే కాల్పుల ఘటనలు పెరిగాయని తెలిపారు. "ప్రధాని రాజకీయ శూన్యత ఏర్పడేందుకు కారణమయ్యారు. దీంతో ఉగ్రవాదులు తమ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగించే వీలు కలిగింది. దీనికి మూల్యం చెల్లిస్తున్నది ఎవరు? ప్రధాని కాదు, రక్షణ మంత్రి కాదు. మన సైన్యం, వారి కుటుంబాలు మూల్యం చెల్లిస్తున్నాయి. దాదాపు దశాబ్దకాలంలో ఎన్నడూ లేనన్ని సైనిక మరణాలు ఇటీవలి కాలంలో సంభవించాయి" అని రాహుల్ అన్నారు. మోదీ వైఖరితో కలిగిన నష్టాన్ని భవిష్యత్తులో చరిత్రే తేలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఇండియాకు వ్యతిరేకంగా వ్యవహరించే వారితో చేతులు కలిపి జమ్మూ కాశ్మీర్ లో రాజకీయ ప్రయోజనాలను మోదీ పొందుతున్నారని, ఇప్పుడా వ్యక్తే, కాశ్మీర్ మండుతుంటే, స్పందించడం లేదని ఆరోపించారు.

More Telugu News