: పెళ్లి చేసుకుంటానని కట్నం తీసుకొని పరారవుతున్న కానిస్టేబుల్‌.. తెలివిగా పట్టుకున్న పోలీసులు

వృత్తిరీత్యా దొంగ‌ల్ని ప‌ట్టుకునే ఉద్యోగం చేస్తుంటాడు.. కానీ, సైడ్ బిజినెస్‌లా దొంగ‌లా ప్ర‌వ‌ర్తిస్తున్నాడు ఓ కానిస్టేబుల్. ఎట్ట‌కేల‌కు ఆ మోస‌గాడి ఆట‌క‌ట్టించిన మంచాల పోలీసులు తాజాగా ఆ కానిస్టేబుల్‌ను అరెస్టు చేశారు. 8 ఏళ్ల క్రిత‌మే వివాహం చేసుకున్న‌ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన 30 ఏళ్ల‌ హరిచరణ్‌తేజ వరంగల్‌లోని తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ 4వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ప‌లువురు యువ‌తుల కుటుంబాల‌ను మోసం చేశాడు. త‌న‌కింకా పెళ్లి కాలేద‌ని చెప్పుకుంటూ యువ‌తుల‌ను పెళ్లి చేసుకుంటానంటూ మాయ‌మాట‌లు చెప్పి వారి నుంచి కట్నం డ‌బ్బు తీసుకుని క‌నిపించ‌కుండా పోతున్నాడు. ఇందుకోసం తెలుగు మేట్రిమోని నుంచి వివాహం కాని యువతుల సమాచారం తీసుకునే వాడు. అనంత‌రం ఆ యువ‌తుల‌తో పరిచయం పెంచుకుని, కట్నం తీసుకొని మోసానికి పాల్ప‌డుతున్నాడు. ఇద్దరు యువ‌తుల కుటుంబాల‌ను మోసం చేసి వారి నుంచి లక్షల రూపాయ‌లు డ‌బ్బు తీసుకొని పారిపోయాడు. మంచాల మండలం జాపాల గ్రామానికి చెందిన ఓ యువతిని ఇలాగే మోసం చేశాడు. వివాహ వెబ్‌సైట్‌ ద్వారా పరిచయం చేసుకుని కట్నం మాట్లాడుకొని అడ్వాన్సుగా రూ.లక్ష తీసుకొని జంప్ అయ్యాడు. దీంతో బాధితురాలి అన్న పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. దీంతో పోలీసులు ఇచ్చిన ఐడియాతో హరిచరణ్‌తేజకు ఫోన్ చేసిన బాధితురాలి అన్న మిగ‌తా క‌ట్నం డ‌బ్బులు కూడా ఇచ్చేస్తాన‌ని న‌మ్మ‌బ‌లికాడు. ఈ ఆఫర్ కు సంబ‌ర‌ప‌డిపోయిన‌ హరిచరణ్‌తేజ్‌ అతని ఇంటికి డ‌బ్బుకోసం వ‌చ్చాడు. దీంతో వారు ఈ విషయాన్ని మంచాల పోలీసుల‌కి తెల‌ప‌డంతో వారు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News