: ఎన్నికల ప్రచారం కోసం రాలేదు... దేశాన్ని రక్షించమని అడగడానికి వచ్చా: కేజ్రీవాల్

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ యూపీలో తన తొలి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో బీజేపీకి తప్ప... ఇతర ఏ పార్టీకైనా ఓటు వేయండని ఓటర్లకు పిలుపునిచ్చారు. తాను ఓట్లు అడగడానికి ఇక్కడకు రాలేదని... ఓట్ల కోసమే అయితే తన పార్టీ ఆప్ బరిలో ఉన్న పంజాబ్ లేదా గోవా రాష్ట్రాలకు వెళ్లేవాడినని... దేశాన్ని కాపాడాలంటూ మిమ్మల్ని అభ్యర్థించడానికే ఇక్కడకు వచ్చానని కేజ్రీ అన్నారు. ప్రధాని మోదీ అతనికి సన్నిహితులైన వారికి మేలు చేసేందుకు, వారి రుణాలను రద్దు చేసి వారికి సహాయపడ్డారని కేజ్రీ విమర్శించారు. పెద్ద నోట్ల రద్దును కూడా తన స్నేహితులకు మోదీ ముందుగానే చెప్పారని... దాంతో, వారు బ్లాక్ మనీని మేనేజ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారని అన్నారు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా విదేశాలకు పారిపోవడానికి మోదీ సహకరించారని ఆరోపించారు. మరోవైపు, సామాన్యులు మాత్రం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని... బ్యాంకులు, ఏటీఎంల వద్ద గంటలసేపు పడిగాపులు కాసినా, డబ్బు చేతికి రావడం లేదని చెప్పారు. యూపీ వల్లే మోదీ ప్రధాని అయ్యారని... మొత్తం 80 లోక్ సభ స్థానాల్లో 73 స్థానాలను ఈ రాష్ట్ర ప్రజలు బీజేపీకి కట్టబెట్టారని... ఇప్పుడు మళ్లీ ఆ పొరపాటు చేయకూడదని, బీజేపీని ఓడించాలని కోరారు.

More Telugu News