: కేంద్ర మంత్రులకు, ఉగ్రదాడులకు లింక్ పెడుతూ ఒమర్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు

'పాక్ ఆక్రమిత కశ్మీర్ ఏమైనా భారత్ జాగీరా?' అంటూ నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఇటీవలే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన బాటలోనే ఆయన కుమారుడు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నడిచారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఒమర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ పై కేంద్ర మంత్రులు విమర్శలు గుప్పిస్తూ, రెచ్చగొట్టడం వల్లే... వాళ్లు నగ్రోటా పట్టణంపై దాడి చేసి, ఏడుగురు సైనికులను హతమార్చారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఉగ్రదాడికి కేంద్రమంత్రులే కారణమని అన్నారు. దక్షిణ కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పెద్దనోట్లను రద్దు చేస్తే ఉగ్రవాదం అంతమవుతుందని ఓ వైపు ప్రధాని మోదీ చెబుతున్నారని... కానీ, దానికి విరుద్ధంగా ఉగ్రదాడులు పెరుగుతున్నాయని ఒమర్ ఎద్దేవా చేశారు. భారత్ వైపు చెడు దృష్టితో చూస్తే కళ్లు పీకేస్తామని రక్షణ మంత్రి పారికర్ చేసిన వ్యాఖ్యలను ఒమర్ తప్పుబట్టారు. రక్షణ మంత్రే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే, నగ్రోటా లాంటి ఉగ్రదాడులు తప్పవని చెప్పారు.

More Telugu News