: బెంగాల్ లో హైడ్రామా... టోల్ బూత్ ల వద్ద సైన్యం కాపలా... సైన్యం కదిలే వరకు ఇంటికి వెళ్లనన్న ముఖ్యమంత్రి.. రాత్రంతా ఆఫీసులోనే!

నోట్ల రద్దు తరువాత కేంద్రంపై యుద్ధం చేస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తన పోరును మరింత ఉద్ధృతం చేశారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ఉన్న టోల్ బూత్ ల వద్ద సైన్యాన్ని మోహరించడాన్ని ఆమె తీవ్రంగా నిరసిస్తూ, కార్యాలయం నుంచి కదలలేదు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా టోల్ గేట్ ల వద్ద సైన్యాన్ని నియమించడాన్ని ఆమె తీవ్రంగా ఆక్షేపించారు. "ఇది సైనిక తిరుగుబాటా?" అని ప్రశ్నించిన ఆమె, సైన్యం మాక్ డ్రిల్ చేయాలని భావించినా, రాష్ట్రం అనుమతి తప్పనిసరని అన్నారు. సైన్యం వెళ్లిపోయేదాకా తాను ఇంటికి వెళ్లేది లేదని సచివాలయంలోని తన కార్యాలయంలో ఆమె రాత్రి నుంచి బైఠాయించారు. సామాన్యులకు తాను జవాబుదారీగా ఉన్నానని, రాత్రంతా తాను ఆఫీసులోనే ఉండి పరిస్థితిని చూస్తానని చెప్పిన ఆమె అన్నంత పనీ చేశారు. ఆమె కార్యాలయానికి 500 మీటర్ల దూరంలోనే హుగ్లీ బ్రిడ్జ్ టోల్ బూత్ ఉంది. అక్కడా సైన్యం కాపలాకు దిగింది. అర్ధరాత్రి తరువాత హుగ్లీ బ్రిడ్జ్ నుంచి సైన్యం వెళ్లిపోయినా మమత కదల్లేదు. ఇంకా 18 రాష్ట్రాల్లోని టోల్ బూత్ ల వద్ద సైన్యం కాపలా కాస్తోందని, వాళ్లంతా వెళ్లిపోవాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా, నేటి నుంచి టోల్ బూత్ ల వద్ద డబ్బులు చెల్లించక తప్పనిసరి పరిస్థితి నెలకొనడంతో, ప్రజలు నిరసనలకు దిగి, విధ్వంసం సృష్టించవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల మేరకే సైన్యాన్ని మోహరించినట్టు తెలుస్తోంది.

More Telugu News