: ఆర్బీఐ నుంచి నిధుల విడుదలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి: సీఎం చంద్రబాబు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి నిధుల విడుదల వంటి అంశాలపై ప్రజలకు వెంటనే స్పష్టత ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. నగదు రహిత లావాదేవీలపై కేంద్ర కమిటీ సభ్యులతో చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. ఈ కాన్ఫరెన్స్ లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఒడిశా సీఎస్, నీతి ఆయోగ్ చైర్మన్ పనగరియ, సీఈఓ అమితాబ్ కాంత్, కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కొన్ని బ్యాంకులు తమ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాయని, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడటం మంచిది కాదని అన్నారు. నగదు రహిత లావాదేవీల విషయమై అందరి సలహాలను ఈ సందర్భంగా చంద్రబాబు కోరారు. ఏపీలో నగదు రహిత లావాదేవీలు, పెద్దనోట్ల రద్దు తర్వాత పరిస్థితులను మిగతా రాష్ట్రాల సీఎంలకు చంద్రబాబు వివరించారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో కమిటీల వివరాలను పేర్కొన్నారు. నగదు రహిత లావాదేవీల కోసం ఇతర దేశాల్లో జరుగుతున్న ప్రయత్నాలపై చంద్రబాబు ఆరా తీశారు. మన దేశంలో అమలు జరిపేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఇంటర్నెట్ కనెక్టివిటీపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పనగరియ, ఆధార్ చైర్మన్ నందన్ నిలేకనీతో చంద్రబాబు చర్చలు జరిపారు. ఈ విషయమై మరోసారి సమావేశమవుదామని చంద్రబాబు సూచించారు. కాగా, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాల్సిందేనని అన్నారు.

More Telugu News