: రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.800 కోట్లు నష్టం వచ్చింది: కేబినెట్ భేటీలో చంద్రబాబు

వెలగపూడి సచివాలయంలో ఈరోజు జరిగిన ఏపీ తొలి కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలు పడుతున్న సమస్యలు, ప్రతిష్టాత్మక సంస్థలకు భూ కేటాయింపు సహా కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, పెద్దనోట్ల రద్దును మొదట్లో అందరూ స్వాగతించారని, అయితే, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయని, రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.800 కోట్లు నష్టం వచ్చిందని అన్నారు. వచ్చే నెలాఖరుకు రూ.1500 కోట్ల నష్టం చవిచూస్తామని, డిసెంబర్ నెలాఖరుకు ఈ పరిస్థితులను చక్కదిద్దాలని చంద్రబాబు సూచించారు. రెండు, మూడు రోజుల్లో రాజధాని భవనాల డిజైన్లు ఖరారు చేస్తామని, స్విస్ ఛాలెంజ్ పద్ధతిపై వైఎస్సార్సీపీ పెట్టిన అడ్డంకులను అధిగమించామని, త్వరలో టెండర్లను పిలుస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీ కేబినెట్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు... వచ్చే నెలలో పోలవరం కాంక్రీట్ పనులు ప్రారంభించాలని, మేయర్, డిప్యూటీ మేయర్, నగర పంచాయతీ చైర్మన్ల వేతనాలు పెంచాలని, విజయనగరం జిల్లా గరివిడి వెటర్నరీ కళాశాలకు 22 పోస్టులు మంజూరు చేయాలని, చిత్తూరు జిల్లా శ్రీ సిటీ పోలీస్ స్టేషన్ కోసం 172 పోస్టులు మంజూరు చేయాలని, చిత్తూరు జిల్లాలో అపోలో టైర్స్ ఫ్యాక్టరీకి 200 ఎకరాలు, హీరో మోటార్స్ కు, అనంతపురం జిల్లాలో ఏపీఐఐసీ మెగాక్లస్టర్ల కోసం, అమరావతిలో బీఆర్ శెట్టి గ్రూప్ నకు 100 ఎకరాలు, పోలీస్ సబ్ డివిజన్ భవనానికి 1.5 ఎకరాలు కేటాయించాలనే నిర్ణయాలను తీసుకున్నారు.

More Telugu News