: ప్రముఖ మరాఠీ నటుడు శ్రీరాం గోజమ్ అంత్యక్రియలు పూర్తి.. హాజరైన సినీ రంగ ప్రముఖులు

ప్రముఖ మరాఠీ ఫిల్మ్ మేకర్, నటుడు శ్రీరాం గోజమ్ గుండే (71) అంత్యక్రియలు ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మరాఠీ, హిందీ సినీ రంగాలకు చెందిన వారితో పాటు ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, ఆయన అభిమానులు హాజరయ్యారు. కాగా, కొన్ని రోజులగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శ్రీరాం గోజమ్ గుండే లాతూర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు. శ్రీరాం గోజమ్ గుండే కు భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శ్రీరాం గోజమ్ గుండే మృతిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన సంతాపం తెలిపారు. ఇదిలా ఉండగా, మరాఠీ నాటకాల ద్వారా తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీరాం గోజమ్ గుండే, ‘రస్ బహర్’ అనే నాటక సంస్థను కూడా స్థాపించారు. ‘జాట్ పట్ కర్ దే ఖట్ పట్’ చిత్రాన్ని నిర్మించిన ఆయన ఆ సినిమాలో నటించారు. ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా 1974లో మరాఠీ భాషలో తెరకెక్కించిన ‘రాజా శివ్ ఛత్రపతి’ చిత్రంలో నటనకు గాను పలు ప్రశంసలు అందుకున్నారు.

More Telugu News