: రోజుతో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగిన నగదు లభ్యత... అయినా ఏ మూలకు?

ఒకటో తారీఖు ఒత్తిడిని తట్టుకునేందుకు నగదు లభ్యతను నాలుగు రెట్లు పెంచినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అయినప్పటికీ, అత్యధిక బ్యాంకులు, ఏటీఎంలకు డబ్బు చేరని పరిస్థితి నెలకొందన్న విమర్శలు వస్తున్నాయి. రూ. 500 నోట్ల ముద్రణను వేగవంతం చేశామని, తదుపరి కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయి నగదు మార్కెట్లోకి వస్తుందని ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి. మామూలుగా రెండు షిఫ్టుల్లో పనిచేసే కరెన్సీ ముద్రణాలయాలు, ఇప్పుడు మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బ్యాంకులకు మరింతగా నగదు సరఫరా పెరగాల్సి వుందని, ప్రస్తుతం కొత్త కరెన్సీని వాయు మార్గాల ద్వారా వేగంగా కరెన్సీ చెస్ట్ లకు తరలిస్తున్నామని ఆర్బీఐ అధికారి ఒకరు తెలిపారు. కాగా, నాలుగు రెట్ల వరకూ కరెన్సీని పెంచినప్పటికీ, బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ లైన్లు కాస్తంతైనా తగ్గినట్టు కనిపించకపోగా, నెల మొదలు కావడంతో ఈ ఉదయం భారీ ఎత్తున ఖాతాదారులు నగదు కోసం బ్యాంకులను ఆశ్రయించడం కనిపించింది. పలు ప్రైవేటు కంపెనీలు సైతం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తమ ఉద్యోగుల వేతనాలు డిపాజిట్ చేస్తుండటం కూడా రద్దీని మరింతగా పెంచిందని నిపుణులు వ్యాఖ్యానించారు.

More Telugu News