: 'నాడా' వర్షాలు మొదలు... కుంభవృష్టి ఖాయమంటున్న వాతావరణ శాఖ

బంగాళాఖాతంలో ఏర్పడ్డ 'నాడా' తుపాను ప్రభావం చూపడం ప్రారంభించింది. శుక్రవారం ఉదయం తమిళనాడులోని కడలూరు, వేదారణ్యం ప్రాంతాల మధ్య తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ తుపాను వాయుగుండంగా మారగా, దక్షిణ కోస్తాలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో పాటు చెన్నై, కడలూరు చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లో ఈ ఉదయం తేలికపాటి వర్షాలు కురిశాయి. ఒకటి రెండు చోట్ల ఓ మోస్తరు వర్షపాతం కురుస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, రేపు తమిళనాట ఉత్తర కోస్తా తీరంతో పాటు పుదుచ్చేరిలో కుంభవృష్టి కురుస్తుందని, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం చెన్నైకి ఆగ్నేయంగా 770 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుపాను శరవేగంగా తీరంవైపు దూసుకొస్తోంది. 45 నుంచి 55 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్న తుపాను వేగం 65 కి.మీ వరకూ పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.

More Telugu News