: ఎంపీలకు మాత్రం ముందే వేతనాలు... 300 మంది విత్ డ్రా కూడా చేసేసుకున్నారు!

ఒకటో తారీఖు కోసం ఎదురుచూసే వేతన జీవి నేడు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొని వుండగా, మన ప్రజా ప్రతినిధులు మాత్రం ఒక రోజు ముందే తమ వేతనాలను తీసేసుకున్నారు. నిన్న లోక్ సభ, రాజ్యసభ సభ్యుల ఖాతాల్లో వేతనాలు పడగా, ఆ వెంటనే అందరూ పార్లమెంట్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖకు క్యూ కట్టారు. నిన్న ఒక్కరోజులో 300 మందికి పైగా ఎంపీలు డబ్బును విత్ డ్రా చేసుకున్నారు. వీరిలో అత్యధికులు ఒక వారంలో విత్ డ్రా చేసుకునే పరిమతి రూ. 24 వేలను తీసేసుకున్నారు. రాజ్యసభ వాయిదా పడగానే బ్యాంకులో ఎంపీల క్యూ భారీగా కనిపించింది. ఎంపీలు, వారి సిబ్బంది క్యూలో ఉండటంతో బ్యాంకు అధికారులు ఉరుకులు, పరుగుల మీద పని చేసి అందరికీ డబ్బు అందించారు. ఇక పార్లమెంట్ లోని ఏటీఎంల ముందు కూడా భారీ క్యూలు కనిపించాయి. ఉద్యోగుల నుంచి రైతులు, వ్యాపారులు, కూలీలు సహా అన్ని వర్గాల వారు కరెన్సీ కోసం, ముఖ్యంగా చిల్లర కోసం కష్టాలు పడుతున్న వేళ, ఎంపీలు మాత్రం జీతం ముందే పుచ్చేసుకుని, డబ్బు విత్‌ డ్రా చేసుకోవడం గమనార్హం.

More Telugu News