: 2005కు ముందు ప్రింట్ చేసిన వెయ్యి నోట్లు ఆ బ్యాంకులో తీసుకోరట!

2005వ సంవత్సరానికి ముందు ప్రింట్ చేసిన వెయ్యినోట్లను న్యూఢిల్లీలోని నోయిడాలోని బ్యాంకు తీసుకోలేదు. మనీష్ మాధుర్ అనే వ్యక్తి వద్ద 2005కు ముందు ఆర్బీఐ ప్రింట్ చేసిన ఎనిమిది వెయ్యినోట్లు ఉన్నాయి. ఆ నోట్లను మార్చుకునేందుకు నోయిడాలోని సెక్టర్ 19లో ఉన్న ఇండియన్ బ్యాంక్ కు వెళ్లటం జరిగింది. అయితే, సెక్యూరిటీ థ్రెడ్ తో ఉన్న ఆ ఎనిమిది నోట్లను తీసుకునేందుకు బ్యాంకు అధికారులు తిరస్కరించారని మాధుర్ మీడియా ముందు వాపోయారు. ఈ నోట్లు 2005 కంటే ముందు ప్రింట్ అయ్యాయని, అందుకే, వాటిని తాము తీసుకోలేమని, ఆ నోట్లను మార్చుకోవాలని అనుకుంటే కనుక, ఆర్బీఐకు వెళ్లాలని తనకు బ్యాంకు సిబ్బంది సూచించారని పేర్కొన్నారు. ఇదే తరహా సమస్య ఈస్ట్ ఢిల్లీకి చెందిన అర్జున్ శర్మ అనే ఒక వ్యాపారవేత్తకు కూడా ఎదురైంది. తన వద్ద ఉన్న ఇరవైఐదు వెయ్యినోట్లను మార్చుకునేందుకు ఈస్ట్ ఢిల్లీలోని కృష్ణ నగర్ లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఈరోజు వెళ్లిన అర్జున్ శర్మకు బ్యాంకు అధికారులు అదే సమాధానం చెప్పారు. బ్యాంకులు తమ ఇష్టానుసారం రోజుకో నిబంధన పెడుతున్నాయని, ఖాతాదారులను వేధింపుల పాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కాగా, ఈ విషయమై స్పందించేందుకు ఆయా బ్యాంకుల అధికారులు నిరాకరించారు. ఆర్బీఐ నిబంధనల మేరకు తాము వ్యవహరిస్తున్నామని చెప్పారు.

More Telugu News