: 500 రూపాయలతో వివాహం చేసుకున్న ఐఏఎస్ జంట

పెద్దనోట్ల రద్దుతో సమస్యలు చుట్టుముట్టాయి. నగదు లేక ఎన్నో పెళ్లిళ్లు ఆగిపోయాయి. అయితే ఐఏఎస్ జంట వివాహానికి మాత్రం అలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. దానికి కారణమేంటంటే... వారిద్దరూ కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో రిజిస్ట్రారు ఆఫీసులో కేవలం 500 రూపాయల ఖర్చుతో ఘనంగా వివాహం జరుపుకున్నారు. మధ్యప్రదేశ్‌ లోని గోహాడ్ ఎస్డీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారి ఆశిష్ వశిష్ట విజయవాడలో ఎస్డీఎంగా పనిచేస్తున్న సలోనీ సిదానాను వివాహం చేసుకున్నారు. 2013లో ఐఏఎస్ కు సెలెక్ట్ అయిన వీరిద్దరు ముస్సోరిలో శిక్షణ పొందే సమయంలో ప్రేమించుకున్నారు. అనంతరం ఎంపీ కేడర్ కు ఆశిష్, ఏపీ కేడర్ కు సలోనీ ఎంపికయ్యారు. దీంతో రెండు వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్న తాము వివాహం చేసుకునేందుకు అనుమతి కావాలంటూ ఎంపీలోని బింద్ కోర్టుకు దరఖాస్తు చేశారు. న్యాయస్థానం వారికి నవంబర్‌ 28వ తేదీని వివాహానికి కేటాయించడంతో కోర్టు ఫీజు 500 రూపాయలు చెల్లించి, చట్టబద్దంగా వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కాగా, ఆశిష్ స్వస్థలం రాజస్థాన్‌ కాగా, సలోనిది పంజాబ్‌. వీరి వివాహం ముగియడంతో సలోని కూడా మధ్యప్రదేశ్ లో విధులు నిర్వర్తించనున్నారు. ఆమె 2013 సివిల్స్ టాపర్ కావడం విశేషం.

More Telugu News