: నరేంద్ర మోదీని హత్య చేసేందుకు పన్నిన కుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ.. పరారైన ఉగ్రవాద నేత హకీం

ప్రధాని నరేంద్ర మోదీ సహా 21 మంది నేతల హత్యకు అల్ ఖైదా సహకారంతో ఉగ్రవాదులు పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ భగ్నం చేసిన సంగతి విదితమే. ఉగ్రవాదుల నాయకుడు హకీం పరారైనప్పటికీ, నలుగురు ఉగ్రవాదులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఎన్ఐఏ అధికారులు వలపన్ని వీరి అరెస్టుకు కదలగా, చివరి క్షణాల్లో హకీం తప్పించుకున్నట్టు తెలుస్తోంది. పట్టుబడిన వారిని రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అరెస్టయిన వారిలో అబ్బాస్ అలీ (27), అయూబ్ ఖాన్ (26), అబ్దుల్ కరీం (26) ఉన్నట్టు తెలుస్తోంది. వీరు ముగ్గురినీ తొలుత, ఆపై వీరిచ్చిన సమాచారంతో చెన్నైలోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సిస్టమ్ అనలిస్టుగా పనిచేస్తున్న దావూద్ సులేమాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వీరికి చిత్తూరు, నెల్లూరులతో పాటు కొల్లాం, మళప్పురం, మైసూరు ప్రాంతాల్లో జరిగిన కోర్టుల్లో బాంబు పేలుడు కేసులతో సంబంధాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. వీరి నుంచి దిగ్భ్రాంతి గొలిపే సమాచారాన్ని తెలుసుకున్నామని, మోదీ సహా 22 మందిని హత్య చేసేందుకు వ్యూహాలు పన్నారని, వివిధ దేశాల దౌత్యకార్యాలయాలను పేల్చివేసేందుకు కుట్ర జరిపారని వెల్లడించారు. పారిపోయిన హకీం కోసం తమిళనాడు సరిహద్దుల్లో గాలింపును ముమ్మరం చేసినట్టు తెలిపారు.

More Telugu News