: అశ్విన్ మాయాజాలం.. కుక్ ను బోల్తా కొట్టించిన బంతి!

మొహాలీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ హవా కొనసాగుతోంది. మూడో రోజు 274/6 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాకు అశ్విన్ (72), రవీంద్ర జడేజా (90) ఊపిరిపోశారు. అశ్విన్ అవుటైనప్పటికీ జడేజాతో కలిసి జయంత్ యాదవ్ (55) ఆడిన ఇన్నింగ్స్ ఇంగ్లండ్ కష్టాలు పెంచింది. వీరు ముగ్గురూ రాణించడంతో టీమిండియా 417 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ ను రవిచంద్రన్ అశ్విన్ తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. దీంతో తడబడుతూ ఆడిన కుక్ డీఆర్ఎస్ పుణ్యమా అని రెండు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 14వ ఓవర్‌ చివరి బంతిని అశ్విన్‌ సంధించగా ప్యాడ్స్, బ్యాట్ మధ్యలోని చిన్న గ్యాపు నుంచి మెలితిరుగుతూ వెళ్లిన బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో అశ్విన్, కోహ్లీ ఆనందంతో గంతులేయగా, తాను డిఫెన్స్ ఆడిన బంతి అలా ఎలా దూరిపోయిందా? అని ఆలోచించుకుంటూ కుక్ (12) పెవిలియన్ బాటపట్టాడు. అనంతరం మెయిన్ అలీ (5) కూడా అశ్విన్ ఉచ్చులో చిక్కాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు తన రెండో ఇన్నింగ్స్ 26 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. రూట్ (29), బెయిర్ స్టో (6) పరుగులతో క్రీజులో ఉన్నారు. అశ్విన్ రెండు వికెట్లు తీసి రాణించాడు.

More Telugu News