: చంద్రబాబుకు అరుణ్ జైట్లీ ఫోన్... కమిటీకి నేతృత్వం వహించాలని విన్నపం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా, పెద్ద నోట్ల రద్దు తర్వాత నెలకొన్న పరిస్థితులపై ఇరువురూ చర్చించారు. పరిస్థితిని మరింత మెరుగుపరిచేందుకు ఏం చేస్తే బాగుంటుందో చర్చించారు. మరోవైపు, ప్రస్తుతం నెలకొన్న ఇబ్బందులను అధిగమించే క్రమంలో 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సబ్ కమిటీ వేస్తున్నామని... ఆ కమిటీకి నేతృత్వం వహించాలని చంద్రబాబును జైట్లీ కోరారు. అయితే, కమిటీకి నేతృత్వం వహించే విషయాన్ని పరిశీలిస్తాను కానీ... ఇప్పటికిప్పుడు తన నిర్ణయాన్ని చెప్పలేనని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. ఇదే సమయంలో బ్యాంకర్ల తీరు పట్ల జైట్లీతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. నోట్లు రద్దై 20 రోజులు గడుస్తున్నా, పరిస్థితిని మెరుగు పరిచేందుకు బ్యాంకులు సరైన చర్యలు తీసుకోవడం లేదని, ప్రజల సమస్యల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ తో పాటు ఇతర బ్యాంకర్లు చేస్తున్న తప్పిదాలకు తాము ఎలా బాధ్యత తీసుకోవాలని జైట్లీని చంద్రబాబు సూటిగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇప్పటికీ బ్యాంకులు, ఏటీఎంల వద్ద వందలాది మంది ప్రజలు క్యూలైన్లలో నిలబడుతున్నారని... దీంతో, ఎక్కువ క్యాష్ ను వెంటనే తీసుకురావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు సూచించారు. ఏదేమైనప్పటికీ, నోట్ల ఇబ్బందులపై కేంద్ర ప్రభుత్వం పూర్థి స్థాయిలో దృష్టి సారించినట్టు దీంతో మనకు అర్థమవుతోంది. అందుకే ఇబ్బందులను తొలగించేందుకు సబ్ కమిటీ వేసే దిశగా అడుగులు వేస్తోంది.

More Telugu News