: రీకౌంటింగ్ వ‌ల్ల ఒరిగేదేమీ ఉండదు.. ఫ‌లితం మారిపోదు: తేల్చి చెప్పిన‌ ట‌్రంప్‌

ఓట్ల రీకౌంటింగ్ వ‌ల్ల పెద్ద‌గా ఒన‌గూరే ప్ర‌యోజ‌నం ఏమీ ఉండ‌ద‌ని, ఫ‌లితాలు మారిపోవ‌ని అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో జ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేసిన డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్య‌క్తం చేశారు. అధ్యక్ష ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసిన స్టెయిన్‌, మ‌రో అభ్య‌ర్థి అభ్య‌ర్థ‌న మేర‌కు విస్కాన్సిన్ రాష్ట్రంలో పోలైన ఓట్ల‌ను తిరిగి లెక్కించనున్న‌ట్టు శుక్ర‌వారం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో స్పందించిన ట్రంప్ వ‌రుస ట్వీట్లు చేశారు. రీకౌంటింగ్ వ‌ల్ల ఫ‌లితాలేమీ మారిపోవ‌ని పేర్కొన్నారు. విస్కాన్సిన్ స‌హా మూడు రాష్ట్రాల్లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో అతిక్ర‌మ‌ణ‌లు జ‌రిగాయ‌ని, రీకౌంటింగ్ జ‌ర‌పాల్సిందేన‌ని డిమాండ్ చేసిన గ్రీన్ పార్టీపైనా ట్రంప్ విరుచుకుప‌డ్డారు. గ్రీన్ పార్టీ డిమాండ్‌లో 'స్కామ్' క‌నిపిస్తోంద‌ని అన్నారు. అయితే ప్ర‌జ‌లు మాత్రం ఎన్నిక‌లు ముగిశాయ‌నే భావిస్తున్నార‌ని ట్రంప్ మ‌రో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ప్ర‌తి ఒక్క‌రు గౌర‌వించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఇప్పుడు ఆలోచించాల్సింది అమెరికా భ‌విష్య‌త్తు గురించ‌ని పేర్కొన్నారు. డ‌బ్బుల కోస‌మే జిల్ స్టెయిన్ రీకౌంటింగ్‌కు పట్టుబ‌ట్టార‌ని ట్రంప్‌ ఆరోపించారు.

More Telugu News