: రానున్న బినామీ చట్టం అత్యంత కఠినం: నరేంద్ర మోదీ

దేశ చరిత్రలోనే అత్యంత కఠినమైన బినామీ చట్టాన్ని తీసుకువస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ప్రస్తుతం ప్రతిపాదనల స్థాయిలో ఉన్న దీన్ని త్వరలోనే అమల్లోకి తీసుకు వస్తామని తెలిపారు. అధికంగా డబ్బును కూడబెట్టి, దానితో బినామీల పేరిట ఆస్తులను కూడబెట్టేవారి పట్ల ఈ కొత్త చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. ఎంత దగ్గరి వారైనా, ఎంత ఆశపెట్టినా, పక్క వ్యక్తి ఆస్తిని తన పేరిట ఉంచుకోవద్దని బినామీలకు ప్రధాని పిలుపునిచ్చారు. ఒకసారి చట్టానికి పట్టుబడితే, ఆపై శిక్షలను ఎదుర్కోవాల్సి వుంటుందని, ఎలాంటి తప్పూ చేయకుండానే తమ వారికి దూరమవుతారని ఆయన హెచ్చరించారు. నోట్ల రద్దు తరువాత ప్రజలకు ఆర్థిక సేవలను అందించడంలో తపాలా ఉద్యోగులు, బ్యాంకుల ఉద్యోగులూ తీవ్రంగా శ్రమిస్తున్న తీరు తనకెంతో గర్వంగా ఉందని మోదీ వ్యాఖ్యానించారు. జాతి ప్రయోజనాల కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రపంచమంతా గమనిస్తోందని, దీని ప్రభావం ఎలా ఉంటుందని ఎన్నో అగ్రరాజ్యాలు ఇండియాను నిశితంగా గమనిస్తున్నాయని ఆయన అన్నారు. దేశం ఓ మహత్తర శక్తిగా ఎదగాలన్న కోరిక ప్రజల్లో ఎంత బలంగా ఉందో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తరువాత తనకు తెలిసిందని, వారి ఆకాంక్షను నెరవేర్చేంత వరకూ శ్రమిస్తానని చెప్పారు.

More Telugu News