: ఒకరిని కాపాడేందుకు మరొకరు... ఆయుధాలు దాచేసిన కేసీఆర్, చంద్రబాబు!

భావ వ్యత్యాసం, రాజకీయ వైరుధ్యమున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న వాతావరణం, ఇప్పుడు కనిపించడం లేదు. గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఈ ఇద్దరు శత్రువులూ ఒకరి కోసం మరొకరు అన్నట్టుగా చేతులు కలిపినట్టు తెలుస్తోంది. జూన్ 2015లో నమోదైన 'క్యాష్ ఫర్ ఓట్' స్కాములో హైదరాబాద్ లోని ఏసీబీ ప్రత్యేక కోర్టు, పునర్విచారణ జరపాలని ఆదేశించిన తరువాత ఇద్దరు చంద్రుల మధ్యా సఖ్యత పెరిగినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వాస్తవానికి ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు, చంద్రబాబు మరచిన కుంభకోణాన్ని తిరిగి ఆయన ముందుకు తీసుకు వచ్చినట్టే. ఓ సంవత్సరం క్రితం వరకూ చంద్రబాబు పేరెత్తినా కూడా సహించేది లేదన్నట్టు మాట్లాడుతూ, హైదరాబాద్ లో బాబును బయటి వ్యక్తిగానే భావిస్తామని స్పష్టం చేస్తూ, తనవద్ద అందుబాటులో ఉన్న అన్ని ఆయుధాలనూ ఆయనపై ప్రయోగించేందుకు వెనుకాడబోనన్న సంకేతాలు ఇచ్చిన కేసీఆర్, ఇప్పుడు అవకాశమున్నా ఆ ప్రయత్నాలు చేయడం లేదు. ఇక తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ బి.శివధర్ రెడ్డిని బదిలీ చేయడం వెనుక పెద్దల నడుమ కుదిరిన ఒప్పందాల తాలూకు ఆలోచనలు ఉన్నట్టు రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. వాస్తవానికి ఓటుకు నోటు కేసులో అన్ని రకాల ఫోన్ ట్యాపింగ్స్ శివధర్ రెడ్డి అధీనంలోనే జరిగాయి. చంద్రబాబునాయుడు, ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ మధ్య జరిగిన సంభాషణను, రేవంత్ రెడ్డి రూ. 5 కోట్లను ఆఫర్ చేస్తున్న వేళ తీసిన దృశ్యాలు, రికార్డింగ్స్ ను ఆయనే పర్యవేక్షించారు. ఇప్పుడాయనను ఏ మాత్రం ప్రాధాన్యత లేని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేస్తూ, యువ ఐపీఎస్ ఆఫీసర్ వి.నవీన్ చంద్ కు ప్రమోషన్ ఇస్తూ, ఇంటెలిజెన్స్ విభాగానికి చీఫ్ గా నియమించింది కేసీఆర్ సర్కారు. ఒకప్పుడు చంద్రబాబును వదిలేది లేదని శపథాలు చేసిన కేసీఆర్, ఆపై నెమ్మదిగా ఈ విషయాలను ప్రస్తావించడమే మానేశారు. రేవంత్ అరెస్ట్ తరువాత, చంద్రబాబును సైతం జైలుకు పంపేందుకు కేసీఆర్ ప్రభుత్వం గట్టి సాక్ష్యాలను సంపాదించిందన్న ఊహాగానాలు సైతం వచ్చాయి. కేసీఆర్, చంద్రబాబుల మధ్య ఉన్న విభేదాల కారణంగానే, శత్రువుకు శత్రువు మిత్రుడన్న నానుడిని పాటిస్తూ, జగన్, కేసీఆర్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. ఇక, ఇటీవలి కాలంలో కేసీఆర్ నోటివెంట ఈ ఓటుకు నోటు కేసు, చంద్రబాబుపై తీసుకునే చర్యల విషయమై ఒక్క మాట కూడా వెలువడక పోవడం గమనార్హం. ఇద్దరు ముఖ్యమంత్రులూ తమ వద్ద ఉన్న ఆయుధాలను పక్కనబెట్టి పరస్పర లాభాలు, పరస్పర ప్రయోజనాల దిశగా అడుగులు వేస్తున్నట్టు గత సంవత్సరమే నలుగురికీ కనిపించింది. అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ వెళ్లిరాగా, కేసీఆర్ నిర్వహించిన అయుత చండీయాగానికి చంద్రబాబు హాజరయ్యారు. ఆపై ఇద్దరు నేతలు పలుమార్లు కలుసుకున్నారు కూడా. గవర్నర్ నరసింహన్ తో పలుమార్లు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి ఉమాభారతి వద్ద నీటి పంచాయితీలను పరిష్కరించుకునే చొరవ చూపారు. ఇదిలావుండగా, చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య సఖ్యతను కుదిర్చేందుకు ఓ ప్రముఖ సీనియర్ వ్యాపారవేత్త, ప్రసార మాధ్యమాల అధిపతి చేసిన కృషి ఫలించిందని, ఆ కారణంగానే ఇద్దరు నేతలూ ఒకరిని ఒకరు విమర్శించుకోవడం మానివేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పొరుగున ఉన్న రాష్ట్రాలతో సఖ్యంగా ఉండటం ద్వారా అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపించడమే తన లక్ష్యమని చంద్రబాబు అంటుండగా, తెలుగు ప్రజలంతా రాష్ట్రంగా విడిపోయినా, అన్నదమ్ములేనని, కలసి ముందుకు సాగాలని కేసీఆర్ అంటున్నారు. ఏపీలో జగన్ ను అధికారంలోకి రానీయకుండా చూడాలంటే, కేసీఆర్ కు జగన్ ను దగ్గర కానీయరాదని చంద్రబాబు భావిస్తున్నారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ లేదా వైసీపీ ఎదగకూడదంటే, టీడీపీ పార్టీ కొంతైనా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇదే సమయంలో కుల సమీకరణాల నేపథ్యం కూడా కేసీఆర్, చంద్రబాబులను దగ్గర చేసినట్టు తెలుస్తోంది. అతి తక్కువ బలమున్న వెలమ వర్గానికి చెందిన నేతగా, తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో ఉన్న రెడ్డి వర్గాన్ని సంతృప్తి పరచకుంటే, అధికారాన్ని ఎక్కువ కాలం అనుభవించలేమని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు కాకున్నా భవిష్యత్తులో చంద్రబాబు కన్నా, జగన్ తోనే తనకు ఎక్కువ నష్టం వాటిల్లవచ్చన్న కేసీఆర్ ఆలోచన సైతం చంద్రబాబుతో స్నేహాన్ని పెంచుకునేందుకు కారణమవుతోందని తలపండిన రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉంటే, టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను చీలుస్తుందని, అది తమకే లాభమని కూడా ఆయన భావిస్తున్నారు.

More Telugu News