: ట్రంప్ ప్ర‌మాణ స్వీకారానికి ముందే అమెరికాలో అడుగుపెట్టాల‌ని ఆరాటం.. పోటెత్తుతున్న వ‌ల‌స‌దారులు

ఏమో..! ట్రంప్ అనుకున్నంత ప‌నీ చేస్తారేమో! ఎందుకైనా మంచిది ఇప్పుడే స‌ర్దుకుంటే పోలా? అని వల‌స‌దారులు ఆలోచిస్తున్న‌ట్టున్నారు. అందుకే, పెట్టేబేడా స‌ర్దుకుని అమెరికాకు పోటెత్తుతున్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని స్థాయిలో అగ్రరాజ్యానికి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. తాను అధ్య‌క్షుడినైతే వ‌ల‌స‌దారుల‌పై ఉక్కుపాదం మోపుతాన‌ని ట్రంప్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే. అనుకున్న‌ట్టు ఆయ‌న అనూహ్యంగా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. ఇక ప్ర‌మాణ‌స్వీకార‌మే త‌రువాయి. దీంతో వ‌ల‌స‌దారుల గుండెల్లో గుబులు మొదలైంది. ఆయ‌న ప్ర‌మాణ‌స్వీకారానికి ముందే అమెరికాలో అడుగుపెట్టేయాల‌ని భావిస్తున్నారు. సెంట్ర‌ల్ అమెరికా దేశాల్లోని నిరుపేద‌లు, క‌ల్లోల జీవితం గ‌డుపుతున్న‌వారు అక్ర‌మంగా స‌రిహ‌ద్దులు దాటుతూ అమెరికాలో అడుగుపెడుతున్నారు. ఇటీవ‌లి కాలంలో ఇవి బాగా పెరిగిన‌ట్టు అధికారులు చెబుతున్నారు. ఇక అమెరికాలో చొర‌బ‌డుతున్న వారిలో స‌గం మంది మెక్సికో నుంచి చొర‌బ‌డిన‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు మెక్సికో స‌రిహ‌ద్దులో 4.10 ల‌క్ష‌ల మంది వ‌ల‌స‌దారుల‌ను అదుపులోకి తీసుకోవ‌డం ఇందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. దీన్ని దృష్టిలో పెట్టుకునే ట్రంప్ అమెరికా, మెక్సికో స‌రిహ‌ద్దులో గోడ క‌డతాన‌ని పేర్కొన్నారు. మ‌రోవైపు అక్ర‌మ వ‌ల‌స‌ల‌ను అరిక‌ట్టేందుకు శాన్‌డిగో, మెక్సికోలోని టిజువావాల‌ను వేరు చేస్తున్న కంచె స‌మీపంలో పెద్ద సంఖ్య‌లో భ‌ద్ర‌తా ద‌ళాల‌ను మోహ‌రించారు.

More Telugu News