: మహిళలను కించపరిచే వాణిజ్య ప్రకటనపై క్షమాపణలు కోరిన రణ్ వీర్ సింగ్

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రణ్‌ వీర్‌ సింగ్‌ క్షమాపణలు చెప్పాడు. తను నటించిన 'జాక్‌ అండ్‌ జోన్స్‌' కంపెనీ ప్రకటన వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇందులో మహిళలను కించపరిచే విధంగా... 'ఆఫీసు పనిని ఇంటికి కూడా తీసుకెళ్లొచ్చు' అన్న క్యాప్షన్‌ తో ఓ మహిళను భుజాన వేసుకుని వెళ్తున్న చిత్రంతో ఏర్పాటు చేసిన బిల్‌ బోర్డ్‌ లపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి, దీనిపై సదరు కంపెనీ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, కంపెనీ క్షమాపణలు చెబితే తాను చెప్పినట్టేనని ఇంతకుముందు ప్రకటించిన రణ్ వీర్ సింగ్ తనపై ఇప్పుడు విమర్శలు పెరగడంతో బెట్టువీడాడు. ఒక ప్రకటనను డిజైన్‌ చేసుకుంటున్నప్పుడు వారి సృజనాత్మకతకు స్వేచ్ఛ నివ్వడం ముఖ్యమని భావించి, కంపెనీ చెప్పినట్టు నటించానని అన్నాడు. ఇలా జరిగినందుకు క్షమించాలని రణ్ వీర్ సింగ్ కోరాడు. తాను వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ప్రతి మహిళను గౌరవిస్తానని, వారిని అగౌరవపరిచేలా ఇంకెప్పుడూ ఏమీ చేయనని తెలిపాడు. ఈ యాడ్ గతించిన విషయమని, ఆ బిల్‌ బోర్డులను ఏర్పాటు చేసిన 30 నగరాల్లో రాత్రికిరాత్రే తీసేసి, చేసిన తప్పును సరిదిద్దుకున్నామని తెలిపాడు.

More Telugu News