: బ్యాంకులు, ఏటీఎంల ఎదుట ప్రజలు పడుతున్న అవస్థలపై పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం

పెద్ద‌నోట్ల ర‌ద్దు అనంత‌రం ప్ర‌జ‌లు ప‌డుతున్న క‌ష్టాల గురించి జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ మొద‌టిసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కర్నూలులోని ఓ ఎస్బీఐ శాఖ ముందు క్యూలో నిల‌బ‌డి మరణించిన బాలరాజు కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నాన‌ని ప‌వ‌న్ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా బాల‌రాజు ఫొటోను కూడా ఆయన ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. డబ్బులు డ్రా చేసుకోవడానికి బాల‌రాజు మూడు రోజులుగా ప్రయత్నించార‌ని, అయిన‌ప్ప‌టికీ డ‌బ్బు దొర‌క‌లేద‌ని చివ‌రికి బ్యాంక్‌లోనే మృతి చెందార‌ని పవన్ ఆ పోస్టులో రాశారు. పార్ల‌మెంటు స‌భ్యులు ప్రజల కష్టాలని ప‌ట్టించుకోవాల‌ని పవన్ అన్నారు. ప్ర‌జ‌ల‌కి సంఘీభావం తెలపడానికి వారంద‌రూ బ్యాంకుల దగ్గర క్యూలో నిలబడాల‌ని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ ఎంపీలు ప్ర‌జ‌ల‌తో పాటు ఏటీఎమ్‌లు, బ్యాంకు ముందు నిల‌బ‌డి, తమ మద్దతు ప్రకటిస్తే జ‌నాల‌కి ధైర్యంగా ఉంటుందని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

More Telugu News