: కమ్యూనిస్ట్ యోధుడు.. అమెరికాకు ముచ్చెమటలు పట్టించిన క్యూబా మాజీ అధినేత ఫెడల్ క్యాస్ట్రో ఇకలేరు!

ప్రపంచంలోని గొప్ప నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో తుదిశ్వాస విడిచారు. 90 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. చాలా కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో అధ్యక్ష బాధ్యతలను తన సోదరుడు రౌల్ క్యాస్ట్రోకు అప్పగించారాయన. 1976 నుంచి 2008 వరకు క్యూబా అధ్యక్షుడిగా ఆయన సేవలందించారు. అంతకు ముందు 1959 నుంచి 1976 వరకు ఆయన క్యూబా ప్రధానిగా ఉన్నారు. పాశ్చాత్య దేశాల్లో తొలి కమ్యూనిస్ట్ దేశాన్ని ఏర్పాటు చేసిన ఘనత క్యాస్ట్రోదే. 1959 లో ఫుల్జెన్సియో బతిస్టాలో మిలిటరీ ప్రభుత్వాన్ని కూలదోసి, కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని స్థాపించారాయన. సామ్యవాద పద్ధతులతో, అందరూ సమానమే అనే సిద్ధాంతంతో క్యూబాను ఆభివృద్ధి బాట పట్టించారు. తన తుది శ్వాస విడిచేంత వరకు కూడా కమ్యూనిస్టు సిద్ధాంతాల పరిరక్షణకు ఆయన కృషి చేశారు. 1926 ఆగస్టు 13న బిరాన్ లోని హోల్గిన్ లో క్యాస్ట్రో జన్మించారు. ఫిడెల్ క్యాస్ట్రో అసలు పేరు ఫిడెల్ అలెజాండ్రో క్యాస్ట్రో రూజ్. అగ్రరాజ్యం అమెరికా విధానాలను ఎదిరించి నిలిచిన క్యాస్ట్రో... అమెరికా కంట్లో నలుసులా మారారు. ఆయనపై ఎన్నో హత్యాయత్నాలు జరిగినప్పటికీ... ఆయన ప్రాణాలను మాత్రం బలిగొనలేకపోయాయి. ఫిడెల్ క్యాస్ట్రో ఇక లేరు అన్న వార్తతో యావత్ క్యూబా కంటనీరు పెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు... ఆయన మరణవార్తతో విషాదంలో మునిగిపోయారు.

More Telugu News