: తెల్లగళ్ల లుంగీ ధరించినందుకు అసెంబ్లీ సందర్శకుల గ్యాలరీలోకి అనుమతించలేదు!

తెల్లగళ్ల లుంగీ ధరించిన తనను కేరళ అసెంబ్లీలోని సందర్శకుల గ్యాలరీలోకి అనుమతించలేదంటూ ఒక వ్యక్తి అక్కడి మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించాడు. మలప్పురంలోని కొండొట్టి ప్రాంతానికి చెందిన కుంజిమోయిన్ ఈ నెల 8వ తేదీన కేరళ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో అక్కడికి వెళ్లాడు. సుమారు 38 మంది సందర్శకులతో కలిసి తాను కూడా గ్యాలరీలోకి వెళుతుండగా కుంజిమోయిన్ ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయమై ప్రశ్నించగా తెలుపు గళ్ల లుంగి ధరించడమే కారణమని చెప్పారు. దీంతో, నిరాశ చెందిన కుంజిమోయిన్ వెనుదిరిగాడు. ఆ తర్వాత, ఈ విషయమై కేరళ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించాడు. దీనిపై స్పందించిన మానవ హక్కుల కమిషన్, ‘అసెంబ్లీలోకి ప్రవేశించాలంటే డ్రెస్ కోడ్ నిబంధన ఉందా?’ అని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని శాసనసభ కార్యదర్శి వీకే బాబు ప్రకాశ్ ను మానవ హక్కుల కమిషన్ కోరింది. దీనిపై అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం వివరణ ఇస్తూ, సందర్శకుల వస్త్ర ధారణకు సంబంధించి పార్లమెంట్ లో అనుసరిస్తున్న నిబంధనలనే తాము అనుసరిస్తున్నామని చెప్పింది. కాగా, ఫిర్యాదుదారుడు కుంజిమోయిన్ మాట్లాడుతూ, మలబార్ సంప్రదాయం ప్రకారం తాను ఈ దుస్తులను ధరించానని చెప్పాడు. ఈ వస్త్రధారణ నిబంధనలకు విరుద్దంగా ఉంటే, ఆ నిబంధనలను సవరించాలని కోరాడు.

More Telugu News