: ప్రైవేట్ బ్యాంకులకు డబ్బులిస్తున్నప్పుడు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు ఎందుకు ఇవ్వరు?: బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్

ప్రైవేటు బ్యాంకులకు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులున్నప్పుడు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు ఇవ్వడానికి ఉన్న ఇబ్బందులేంటని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ఆర్బీఐని తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. హైదరాబాదులో బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో దేశ ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది మార్చి వరకు 15,707 మిలియన్ల 500 రూపాయల నోట్లు, 6,326 మిలియన్ల 1000 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయని చెప్పారు. ఇంతపెద్ద స్థాయిలో నోట్లను రద్దు చేస్తున్నప్పుడు మనదగ్గరున్న నిల్వలు, ముద్రించగల సామర్థ్యాన్ని చూసుకోరా? అని ప్రశ్నించారు. దానికి తోడు ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయని, నోట్లు అందుబాటులో ఉన్నాయని అబద్ధాలు చెబుతున్నారని వారు మండిపడ్డారు. ప్రైవేటు బ్యాంకుల్లో పెద్దఎత్తున నగదు చేతులు మారినట్టు తమకు సమాచారం అందుతోందని వారు తెలిపారు. భారీ ఎత్తున డిపాజిట్లు ఉన్న తాము వెళ్లి ప్రైవేటు బ్యాంకులు, ఇతర రాష్ట్రాలను అడుక్కోవాల్సిన అవసరం ఏంటని వారు ఆర్బీఐ, కేంద్రాన్ని నిలదీశారు. దీనికి తోడు సహకార బ్యాంకులను లెక్క చేయడం లేదని, గ్రామీణ ప్రాంత ప్రజలు సహకార బ్యాంకులకు అనుసంధానమై ఉంటారన్న వాస్తవం ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వాలకు తెలియదా? అని వారు అడిగారు. డిపాజిట్లు ఉండి బ్యాంకుల్లో డబ్బుల్లేవు... ఇళ్లలో పంటలుండీ చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితిలో దేశప్రజలను క్యూలైన్లలో నిలబెట్టారు. ఈ దుస్థితికి కారణమేంటని వారు ప్రశ్నించారు.

More Telugu News