: సిద్దూ కుటుంబాన్ని కాంగ్రెస్ వైపు ఆకర్షించిన మంత్రాంగం ప్రియాంకా గాంధీది!

రాజకీయ నేతగా మారిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ మరో మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆపై సిద్ధూ సైతం కాంగ్రెస్ లోకి రానున్నారన్న ప్రచారం జరుగుతోంది. సిద్ధూ కుటుంబాన్ని కాంగ్రెస్ వైపు ఆకర్షితులను చేయడం వెనుక ప్రియాంకా గాంధీ మంత్రాంగం నడిపినట్టు తెలుస్తోంది. ఆమెకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సహకరించారని తెలుస్తోంది. గత సెప్టెంబర్ లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ తొలిసారిగా ప్రియాంకా గాంధీని కలిశారు. అప్పట్లో వీరిద్దరి మధ్యా ఏం చర్చలు జరిగాయన్న విషయం బయటకు వెల్లడి కానప్పటికీ, తన చిన్న వయసులో 'మిమ్మల్నే అభిమానించేదానినని' సిద్ధూతో ప్రియాంక చెప్పారట. ఆపై సిద్ధూ సైతం దివంగత ప్రధాని ఇందిరాగాంధీతో తనకున్న కొద్దిపాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారట. ఇక బుధవారం సాయంత్రం, ప్రియాంక స్వయంగా పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరిందర్ సింగ్ కు, పంజాబ్ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆషా కుమారికి ఫోన్ చేసి, సిద్ధూ కుటుంబాన్ని స్వయంగా వెళ్లి కలవాలని ఆదేశించారు. ఆపై వీరు వెళ్లి నవజ్యోత్ కౌర్ ను కలవడం, ఆమె 28వ తేదీన పార్టీలో చేరుతానని చెప్పడం జరిగిపోయాయి. వాస్తవానికి సిద్ధూ, ప్రియాంకల మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేసింది ప్రశాంత్ కిశోరేనని తెలుస్తోంది. ఢిల్లీలోని కామన్వెల్త్ క్రీడాగ్రామంలో సిద్ధూను తరచూ కలిసే కిశోర్, ప్రియాంక నివాసముండే లోథీ ఎస్టేట్ రెసిడెన్స్ లో ఆయన కోసం ప్రత్యేక విందును కూడా ఏర్పాటు చేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అలా ప్రశాంత్ సూచనల మేరకు, ఎత్తులు వేసిన ప్రియాంక, సిద్ధూ కుటుంబం కాంగ్రెస్ వైపు ఆకర్షింపబడేలా చేసినట్టు రాజకీయ నిపుణులు చర్చించుకుంటున్నారు.

More Telugu News