: జియో సిమ్ నేరుగా ఇంటికే చేరుతోంది...ఎలాగంటే!

నిన్న మొన్నటి వరకు జియో సిమ్ కోసం క్యూ లైన్లు కట్టేవారు. ఇతర మొబైల్ నెట్ వర్క్ లు కూడా దీటైన పథకాలు తీసుకురావడంతో పాటు, జియో వెనుకనున్న ప్లాన్ ను వినియోగదారులకు వివరించడంతో జియో హవాకు కొంత అడ్డుకట్టవేయగలిగారు. ఈ నేపథ్యంలో ఆర్.కాం 149 రూపాయల రీఛార్జ్ తో అన్ లిమిటెడ్ కాల్స్, 300 ఎంబీ డేటా ఆఫర్ ప్రకటించడంతో అటువైపు వినియోగదారుల తాకిడి పెరుగుతోంది. దీంతో జియోకు పెద్ద షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో జియో సరికొత్త విధానంలో వినియోగదారులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇంటి వద్దకే సిమ్ పంపుతూ వినియోగదారులకు సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 4జీ లేదా వోల్టీ సెల్‌ ఉన్నవాళ్లు మై జియో యాప్‌ డౌన్‌ లోడ్‌ చేసుకుని కోడ్‌ జనరేట్‌ చేసుకుంటే జియో సిమ్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అందులో మిమ్మల్ని కాంటాక్ట్ చేసే మొబైల్‌ నంబరు అడుగుతుంది. దానికి జియో ఒక మెసేజ్ ను పంపుతుంది. అందులో... ‘మీకు నేరుగా ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలా.. అలాగైతే ఈ లింక్‌ క్లిక్‌ చేసి వివరాలు ఇవ్వండి’ అని పేర్కొంటుంది. అక్కడ క్లిక్ చేసి ఆధార్‌, మొబైల్‌ నంబరు, చిరునామా వివరాలు పొందుపర్చాలి. అలాగే ఏ రోజు, ఏ సమయానికి సిమ్ కావాలో పేర్కొంటే ఆ ప్రకారం జియో సిమ్ నేరుగా ఇంటికి వచ్చేస్తుంది. ట్రాకింగ్ లింక్ కూడా పంపుతుంది. దానిలోకి వెళ్తే జియో సిమ్ ఎక్కడి వరకు వచ్చింది? ఎంత సేపట్లో వస్తుంది? వంటి వివరాలన్నీ తెలిసిపోతాయి. ఈ సౌకర్యాన్ని జియో సంస్థ ఐదు మెట్రోపాలిటన్ నగరాల్లో అందుబాటులోకి తీసుకురాగా అందులో హైదరాబాదు మొదటి ఫేజ్ లో ఉండడం విశేషం.

More Telugu News