: మీవి బుర్రలేని నిబంధనలు కావా?: ఆర్బీఐని నిలదీసిన వధువు తండ్రి

పాత నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్బీఐ పెడుతున్న నిబంధనలు చూసి సామాన్యులకు మతిపోతోంది. అకౌంటు నుంచి డబ్బు డ్రా చేసుకునే విషయంలో పెడుతున్న రూల్స్ సామాన్యుడిని ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. పెళ్లికి తగిన ఆధారాలు చూపిస్తే 2.5 లక్షల రూపాయలు బ్యాంకులు ఇస్తాయని ఆర్బీఐ తెలిపింది. అయితే ఇందులో పెళ్లి ఖర్చులకు సంబంధించిన బిల్లులు చూపించాలని నిబంధన విధించింది. ఢిల్లీలో సుమారు 3 గంటల పాటు క్యూలో నిలబడి బ్యాంకు కౌంటర్ చేరిన వసంత్ కుంజ్ అనే వ్యక్తికి డబ్బులివ్వడం కుదరదని, పెళ్లికి సంబంధించిన పలు బిల్లులు కావాలంటూ బ్యాంకు అధికారులు కొర్రీ వేశారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వసంత్ కుంజ్...పెళ్లి ఖర్చుల నిమిత్తం ఏది కొన్నా రశీదులెలా వస్తాయని ప్రశ్నించాడు. వావాహానికి పెట్టే ఖర్చులో చాలా వరకు బిల్లులు లేకుండానే జరుగుతాయని గుర్తుచేశారు. వివాహం వేడుకల్లో డబ్బులు నీళ్లలా ఖర్చవుతాయని, వాటికి రశీదులు ఎలా వస్తాయని ఆయన నిలదీశారు. పూజారికిచ్చే సంభావనకు ఏమని రశీదు అడుగుతామని ఆయన ప్రశ్నించారు. పెళ్లిలోని ఆచారాలకు సంబంధించిన వాటికి రశీదులు ఎలా వస్తాయని ఆయన నిలదీశారు. దీంతో ఆర్బీఐ నిబంధనలపై పలువురు మండిపడుతున్నారు. అయినా కష్టార్జితాన్ని ఖర్చుచేయడానికి ఈ నిబంధనలేంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడుపున పుట్టిన పిల్లల వివాహాలు కూడా ఘనంగా చేయకూడదంటే ఎలా? అని పలువురు పెదవి విరుస్తున్నారు.

More Telugu News