: ఎమర్జెన్సీ సమయంలోనూ ఇందిరాగాంధీకి ఇలాంటి నివేదికలే అందాయి.. కానీ ఏం జరిగింది?: రాజ్యసభలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ

రాజ్యసభ ఈ రోజు మ‌ధ్యాహ్నం 2.00 గంట‌ల వ‌ర‌కు వాయిదా ప‌డింది. అంత‌కు ముందు జ‌రిగిన పెద్ద నోట్ల ర‌ద్దుపై చ‌ర్చ‌లో మొద‌ట మాట్లాడిన ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇటువంటి నిర్ణ‌యం తీసుకున్నందుకు తనను కొంతమంది బతకనివ్వకపోవచ్చునని ప్రధాని మోదీ ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌ల‌పై సమాజ్‌వాదీ ఎంపీ నరేశ్‌ అగర్వాల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రధానికే ప్రాణభయం ఉంటే మ‌న‌ దేశాన్ని ర‌క్షించేదెవ‌ర‌ని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ తీసుకున్న నిర్ణ‌యంతో దేశంలో రెండో ఎమర్జెన్సీ విధించినట్లు ఉంద‌ని నరేశ్‌ అగర్వాల్ అన్నారు. దేశ ప్ర‌జ‌లంతా త‌మ‌వైపే ఉన్నారని మొబైల్ యాప్‌ స‌ర్వేలో తెలిసింద‌ని మోదీ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న స్పందిస్తూ... 1975లో దేశంలో అత్య‌యిక ప‌రిస్థితి విధించినప్పుడు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ వైపే సానుకూలంగా ఉన్నార‌ని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి నివేదికలు అందాయని ఆయ‌న అన్నారు. అనంత‌రం దేశంలో జ‌రిగిన‌ ఎన్నికల్లో ఏం జరిగిందో తెలిసిన విష‌య‌మేన‌ని అన్నారు. యూపీలో వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నికల నేప‌థ్యంలోనే మోదీ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని నరేశ్‌ అగర్వాల్ ఆరోపించారు. భవిష్యత్తులో ఇటువంటి నిర్ణ‌యం తీసుకోవాలంటే లోక్‌సభ, రాజ్యసభ స‌భ్యుల అనుమతి తప్పనిసరి చేయాలని ఆయ‌న డిమాండ్‌ చేశారు. వ్యాపార‌వేత్త‌ విజయ్‌ మాల్యాలాంటి పెద్దలకు ఊర‌ట క‌లిగిస్తూ రూ. 7వేల కోట్ల బ‌కాయిల‌ను మాఫీ చేయ‌డం ప‌ట్ల ఆయ‌న మండిప‌డ్డారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు అంశంపై ఆర్థిక మంత్రితో కూడా చ‌ర్చించకుండా నిర్ణ‌యం తీసుకున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. బ్యాంకుల నుంచి ఖాతాదారులు తీసుకునే డ‌బ్బుపై ప‌రిమితి విధిస్తే దేశ ప్రజలు మోదీ ప్ర‌భుత్వాన్ని నిషేధిస్తారని ఆయ‌న వ్యాఖ్యానించారు.

More Telugu News