: ఇదో అతిపెద్ద సంఘటిత నేరం: మోదీ సర్కారుపై నిప్పులు కురిపించిన మాజీ ప్రధాని

ఇండియాలో పెద్ద నోట్ల రద్దు, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జరిగిన అతిపెద్ద సంఘటిత నేరమని, ఎందరో ప్రభుత్వ పెద్దలు ఈ నేరం వెనుక కుట్ర చేశారని మాజీ ప్రధాని మన్మహన్ సింగ్ రాజ్యసభ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభలో పాత నోట్ల రద్దుపై మన్మోహన్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం నోట్ల రద్దు వల్ల నల్లధనాన్ని పూర్తిగా అరికట్టవచ్చని మోదీ చేస్తున్న ప్రచారాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. నోట్ల రద్దుకు ముందు ఎంతమాత్రమూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని, పూర్తి అనాలోచితంగా వేసిన అడుగులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. సామాన్యులు నిత్యమూ పనులు మానుకుని ఏటీఎంల ముందు, బ్యాంకుల ముందు గంటల కొద్దీ నిలబడుతున్నారని మన్మోహన్ తెలిపారు. ప్రజల కష్టాలకు మోదీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని, తక్షణం వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దు తరువాత వివిధ క్యూలైన్లలో వేచి చూస్తూ, 65 మంది వరకూ మరణించారన్న వార్తలు తనను కలచి వేశాయని చెప్పారు. బ్యాంకుల వద్ద కనీస ఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేయలేకపోయిందని దుయ్యబట్టారు. ఉగ్రవాదం, చొరబాట్లు సైతం పెద్ద నోట్ల రద్దు వల్ల జరుగుతుందని ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. నోట్ల రద్దు గురించిన సమాచారం బీజేపీ నేతలకు ముందే తెలుసునన్న అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఎంతో మంది బీజేపీ నేతలు, రద్దు నిర్ణయం వెల్లడించడానికి ముందే కొత్త కరెన్సీలతో సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు పెట్టుకున్నారని, దీనికి ఏం సమాధానం చెబుతారని, మోదీని ఉద్దేశించి సూటి ప్రశ్న వేశారు. నల్లధనానికి అడ్డుకట్ట వేయబోవద్దని తాను చెప్పడం లేదని, నోట్ల రద్దు మంచిది కాదని కూడా అననని, ఇదే సమయంలో ప్రజాగ్రహం ఏ పార్టీకీ లాభించదని, వారు ఇబ్బందులు పడితే పాలకులు వృథాయేనని అన్నారు. ప్రభుత్వం నిర్మాణాత్మక ఆలోచనలతో ముందుకు రావాలని సూచించిన మన్మోహన్ సింగ్, ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటే సహకరిస్తామని తెలిపారు.

More Telugu News