: నోట్ల రద్దు తరువాత ఆగని వ్యాపారం ఇదొక్కటే... ముందున్న ఆంధ్రప్రదేశ్!

పెద్ద నోట్ల రద్దు తరువాత, వాహన పరిశ్రమ నుంచి నిర్మాణ రంగ పరిశ్రమ వరకూ, గృహోపకరణాల పరిశ్రమ నుంచి వినోద పరిశ్రమ వరకూ కుదేలయ్యాయి. ఎవరి వద్దా చిల్లరకు డబ్బులేని పరిస్థితి. పెద్ద నోట్లను మార్చుకోలేని స్థితి. ఈ నేపథ్యంలోనూ ఒకే ఒక్క వ్యాపార విభాగం ఎంతమాత్రమూ నోట్ల రద్దు ప్రభావాన్ని పట్టించుకోకుండా ముందుకు సాగుతోంది. అదే మద్యం వ్యాపారం. ఈ విషయంలో మిగతా రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ ముందు నిలిచింది. ఏపీలో మద్యం వ్యాపారంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందిస్తూ, రాష్ట్రంలో నిత్యమూ కోటి మంది మద్యం సేవిస్తూ, ఒక్కొక్కరు సగటున రూ. 30ని అదనంగా చెల్లిస్తున్నారని, రోజుకు రూ. 3 కోట్లు, నెలకు రూ. 90 కోట్ల నల్లధనం చేతులు మారుతోందని తెలిపారు. మద్యంపై నోట్ల రద్దు ప్రభావం లేదని వివరించారు. మద్యం వ్యాపారంలో ఉన్న వారు, తమ అమ్మకాలను పెంచుకునేందుకు పాత నోట్లను తీసుకోవడం కూడా వ్యాపారం పెరిగేందుకు కారణమని తెలుస్తోంది. లిక్కర్ వ్యాపారంలో నల్లధనం ప్రవహిస్తోందని అంగీకరించిన సోము వీర్రాజు, కేవలం పెద్ద నోట్ల రద్దుతో ఈ రంగంపై ప్రభావం ఉండదని, ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక మద్యం గరిష్ఠ చిల్లర ధర నిబంధనలను మీరుతూ మరింత నల్లధనాన్ని సర్క్యులేషన్ లోకి తీసుకువస్తున్నారని, వైన్ షాపుల్లో లూజ్ సేల్స్, బార్లలో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం తదితరాలు సైతం బ్లాక్ మనీని వైట్ గా మారుస్తున్నాయని వాణిజ్య నిపుణులు పేర్కొంటున్నారు. సరైన చిల్లరను ఏ రిటెయిలర్ కూడా ఇవ్వడం లేదని, ఇది పట్టపగలే దోపిడీ అని ప్రజలు వాపోతున్న పరిస్థితి నెలకొంది.

More Telugu News