: తండ్రిని చంపిన హంతకురాలితో 'నీ గురించి మాత్రం మాట్లాడు' అన్న ప్రియాంకా గాంధీ.. వెలుగులోకి ‘పాతి పెట్టిన నిజాలు’!

నళిని... దివంగత ప్రధాని రాజీవ్ గాంధి హత్య కేసులో హంతకురాలిగా నిరూపితమై యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న ఖైదీ. నళినితో పాటు మురుగన్, శాంతన్, పేరరివాళన్‌ సహా, ఏడుగురిని దోషులుగా నిర్ధారించి కోర్టు తొలుత ఉరి శిక్ష విధించగా, ఆపై అది యావజ్జీవ శిక్షగా మారిన సంగతి తెలిసిందే. ఇక 2008లో హఠాత్తుగా రాజీవ్ గాంధి కుమార్తె ప్రియాంకా గాంధీ, వేలూరు జైలుకు వెళ్లి, నళినితో మాట్లాడటం అప్పట్లో పెను కలకలం సృష్టించింది. ఇక ఆమె నాడు నళినితో ఏం మాట్లాడారు? ఈ విషయం ఇప్పుడు బయటకు రానుంది. నళిని రాసిన ‘పాతి పెట్టిన నిజాలు’ పుస్తకం నేడు విడుదల కానుండగా, అందులోని కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. "నన్ను చూడటానికి ప్రియాంకా గాంధీ వచ్చారు. మేము నిర్దోషులం అని చెప్పగానే, ఆమెలో కోపం పెరిగింది. ఒక్క క్షణంలో తీవ్ర కంఠస్వరంతో 'నీ గురించి మాత్రం మాట్లాడు' అన్నారు. ఆ సమయంలో నాలో కలవరం రేగింది. అయితే, తన పట్ల సానుకూల ధోరణి ఆమెలో కనిపించింది’’ అని రాసుకొచ్చారు. నాడు ప్రియాంకా గాంధీ కోపంతో అన్న మాటలు నేటికి తనకు గుర్తున్నాయని నళిని తన పుస్తకంలో వివరించినట్టు తెలుస్తోంది. తాము నిర్దోషులమనేందుకు తన వద్ద ఉన్న ఆధారాలను ప్రియాంకతో చెప్పినట్టు ఆమె పేర్కొన్నారు. ఇక ఈ పుస్తకంలో ఇంకా ఎన్ని 'పాతి పెట్టిన నిజాలు' ఉన్నాయోనన్న ఉత్కంఠ నెలకొంది.

More Telugu News