: పెద్ద నోట్ల రద్దుపై తొలిసారి స్పందించిన వైఎస్ జగన్

రెండు వారాల క్రితం పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తరువాత, తొలిసారిగా వైకాపా అధినేత వైఎస్ జగన్ స్పందించారు. నోట్ల రద్దు దీర్ఘకాలంలో దేశానికి మేలు చేసే నిర్ణయమే అయినప్పటికీ, ప్రజలు ఇప్పుడు పడుతున్న బాధను చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని అన్నారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, కరెన్సీ రద్దు సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని తెలిపారు. నల్లధనానికి ఎవరూ మద్దతిచ్చే వారు లేరని, మోదీ ఉద్దేశాన్ని తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. అయితే, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం, చాలినన్ని చిల్లర నోట్లను సిద్ధం చేసుకోవడంలో అధికారులు, ముఖ్యంగా ఆర్బీఐ విఫలమైందని జగన్ విమర్శించారు. ఇప్పటికైనా ప్రజల కష్టాలు తీర్చేలా నగదు లభ్యతను పెంచాలని జగన్ డిమాండ్ చేశారు.

More Telugu News